Ts Assembly session : ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు - హైదరాబాద్ తాజా వార్తలు
16:21 September 16
Assembly: ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు
శాసనసభ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ సమావేశాలు మార్చి 26న ముగిసినందున ఆరు నెలల్లోగా అంటే ఈనెల 25లోగా తిరిగి అసెంబ్లీ, మండలి సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 24న నుంచి ఉభయ సభల సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. వారం, పది రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను.. ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
శాసనమండలిలో ప్రస్తుతం ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్యేల కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒకటి ఖాళీగా ఉంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు శాసనసభ సమావేశాల్లోపు అనుమతి లభిస్తే వెంటనే మండలి ఛైర్మన్‌ను ఎన్నుకునే వీలుంది. సమావేశాల నాటికి ఎన్నికలు జరగకపోతే ప్రొటెం స్పీకర్ భూపాల్‌రెడ్డే కొనసాగుతారు. వచ్చే ఏడాది జనవరి 4వ తేదీకి స్థానిక సంస్థల కోటా స్థానాలు 12 ఖాళీ అవుతాయి.