Telangana assembly elections result 2023 :రాష్ట్రవ్యాప్తంగా హస్తం హవా కొనసాగినా హైదరాబాద్‌లో మాత్రం కారుజోరు కొనసాగింది. జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ మరోసారి పట్టు నిలుపుకుంది. మైనార్టీలు అధికంగా ఉండటం సహా బీజేపీ, జనసేన పొత్తు ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడంతో కాంగ్రెస్‌పెద్దసంఖ్యలో ఓట్లను సాధించలేదు. ఈ అంశం బీఆర్ఎస్కు కలిసివచ్చింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గులాబీపార్టీకి, కాంగ్రెస్ అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చినా మరికొన్నిచోట్ల ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
నగరంలోని సెటిలర్స్ సహా పలువురు పెట్టుబడిదారులు బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపడం ఆ పార్టీకి కలిసివచ్చింది. ఇతర రాష్ట్రవాసుల సంక్షేమానికి పలు భవనాలు నిర్మించడం వారందరికీ అండగా ఉంటామంటూ హామీ ఇవ్వడం గులాబీ పార్టీకి కలిసివచ్చింది. పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో వేరేప్రభుత్వం వస్తే ఇబ్బంది తప్పదన్న అంచనాలతో నగరంలో బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు సహకరించినట్లు పలువురు భావిస్తున్నారు.
Telangana Assembly Election Majority in Hyderabad :ఆంధ్రప్రదేశ్ రాజధాని (Andrapradesh Capital) విషయంలో జగన్ సర్కార్ మాటమార్చుతూ ఉండడంతో ఆ రాష్ట్రానికి చెందిన చాలామంది హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టారు. అలాంటి వారంతా హైదరాబాద్‌లోని వ్యాపార అవకాశాలు, ఇతర అంశాలు చూసి బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా కంపెనీలు వచ్చి తెలంగాణలో పెట్టుబడులుపెట్టాయి.
పదేళ్లలో గ్రేటర్‌వ్యాప్తంగా ఎస్ఆర్డీపీ ఆధ్వర్యంలో కొత్త పైవంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మించారు. నగరం నలుమూలల అభివృద్ధి విస్తరణ జరగడంతో ఏపీ నుంచి వచ్చిన పెట్టుబడిదారులు బీఆర్ఎస్వైపు మొగ్గుచూపినట్లుతెలుస్తోంది. నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి సుమారు 60 వేలకుపైగా ఇళ్లను పేదలకు అందించారు. మరోసారి అధికారంలోకి వస్తే మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ జంటనగరాల పరిధిలో గులాబీపార్టీ ఎక్కువగా సీట్లు దక్కించుకునేందుకు సహకరించింది.