Telangana Assembly Elections Polling Arrangements 2023 : ఈనెల 30న జరగనున్న శాసనసభ ఎన్నికల పోలింగ్ కోసం(Telangana Assembly Elections).. ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. పోలింగ్ కోసం ఈవీఎంల కమిషనింగ్ ఇప్పటికే పూర్తికాగా.. పోలింగ్ బృందాలు సిద్ధమయ్యాయి. హోం-ఓటింగ్ ప్రక్రియ పూర్తికాగా.. 26,660 మంది ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. 80ఏళ్లకు పైబడిన వారు 15,879 మంది, దివ్యాంగులు 9,374 మంది ఇంటి వద్ద ఓటు వేయగా.. అత్యవసర సేవల్లో ఉన్న 1407 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు.
Postal Ballet Votes Telangana 2023 :ఎన్నికల విధుల్లో ఉండే వారికి.. పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) ప్రక్రియ కొనసాగుతుండగా..1.31 లక్షల సిబ్బంది, 35,978 పోలీసులు, 1150 మంది ఇతరులు ఉన్నారు. మొత్తం 1,68,612 పోస్టల్ బ్యాలెట్‌లు ఇచ్చినట్లు.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఇప్పటి వరకు 96,526 మంది ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. 54.39 లక్షల ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ, పంపిణీ దాదాపుగా పూర్తైనట్లు వికాస్‌రాజ్ వివరించారు.
"35,978 పోలీసులకు పోస్టల్ బ్యాలెట్‌లు ఇచ్చాం. ఇతరులకు 1150 మందికి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చాం. హోం-ఓటింగ్ ప్రక్రియ ద్వారా 26,660 మంది ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో 80ఏళ్లకు పైబడిన వారు 15,879 మంది, దివ్యాంగులు 9,374 ఉన్నారు. అత్యవసర సేవల్లో ఉన్న 1407 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మొత్తం 1,68,612 పోస్టల్ బ్యాలెట్‌లు ఇచ్చాం." - వికాస్‌రాజ్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
తెలంగాణలో పక్కా ప్రణాళికతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి : సీఈసీ
ఎన్నికల బరిలో 2290 మంది అభ్యర్థులు : శాసనసభ ఎన్నికల్లో మొత్తం 2290 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. వీరిలో 2068 మంది పురుషులు, 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నట్లు వికాస్‌రాజ్ (Telangana CEO Vikasraj) పేర్కొన్నారు. 1.85 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, 22,000ల మంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్స్,.. ఇతరులు మొత్తం కలిపి 2 లక్షలకు పైగా పోలింగ్ విధుల్లో ఉన్నారని చెప్పారు. 45,000 మంది రాష్ట్ర పోలీసులు.. 23,500 మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులు.. 3000 మంది రాష్ట్రానికి చెందిన ఇతర శాఖల యూనిఫాం సిబ్బంది పోలింగ్ విధుల్లో ఉంటారని వివరించారు. 375 కంపెనీల కేంద్ర బలగాలు విధులు నిర్వర్తించనున్నట్లు తెలిపారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక జాగ్రత్తలు : పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించడంతోపాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రవాణా సదుపాయంతోపాటు ప్రతి చోటా ఉండేలా 20 వేలకుపైగా వీల్ ఛైర్స్ సిద్ధం చేస్తున్నారు. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించారు. అన్ని ఈవీఎంల వాహనాలను జీపీఎస్ సదుపాయంతో ట్రాకింగ్ చేయనున్నారు. రాష్ట్రంలో 12,311 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అధికార యంత్రాంగం అక్కడ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.