Telangana Assembly Elections Polling 2023 :ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం ఇచ్చిన గొప్ప వరం. ఇందులో అక్షరాలు రెండే అయినా.. ప్రజలకు సుపరిపాలన అందించే ప్రధాన ఆయుధం. మెరుగైన పాలనకు బాటలు వేసి.. పౌరుల బంగారు భవితను నిర్దేశిస్తుంది. మరీ పోలింగ్ రోజు నీకు ఉన్న హక్కును సద్వినియోగం చేసుకోవాలి. కానీ రోజున బాధ్యరాహిత్యంగా వ్యవహరిస్తే.. సమాజమే కాదు, దేశం కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. అలాగేఓటు వేసే (Vote) ముందు కొందరికి ఎన్నో సందేహాలు.. వాటికి సమాధానాలివిగో..!
ఓటరు జాబితాలో పేరు లేకుంటే.. ఓటేయలేనా? :ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను రూపొందిస్తారు. అందులో పేరు లేకుంటే ఓటు వేయడం సాధ్యం కాదు. అలాంటి వారు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక.. కొత్తగా ఓటుకోసం ఫారమ్ 6కు దరఖాస్తు చేసుకోవాలి.
ఓటు వచ్చింది. కార్డు రాలేదు. ఓటు వేయవచ్చా? :మీకు ఓటు హక్కు వస్తే.. ఆన్‌లైన్‌లో ఓటరు ఫొటో గుర్తింపుకార్డు (ఈ-ఎపిక్)ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈసీ నిర్ధారించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న ఈ-ఎపిక్ కార్డును ఓటు వేసేందుకు ధ్రువీకరణ పత్రంగా ఎన్నికల సంఘం ఆమోదం తెలపలేదు. ఈసీ (Election Commission) వెబ్‌సైట్‌లో మీ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
తొలిసారి ఓటు వేసేందుకు ఉవ్విళ్లూరుతున్న యువతరం
అమ్మానాన్నలకు 80 ఏళ్లు దాటాయి. ఇంటికి వచ్చి వారితో ఓట్లు వేయించుకొని వెళతారా? :ఆ గడువు ఇప్పటికే ముగిసింది. తెలంగాణలో ముందస్తుగా సుమారు 27,000ల మంది వయోవృద్ధులు ఈ ఎన్నికల్లో దరఖాస్తు చేసుకున్నారు. వారు ఇంటి వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేసుకోని వారు పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సిందే.
ఓటు వేయడానికి ఏమీ తీసుకెళ్లాలి? : ఓటరు కార్డు లేకపోతే పాస్‌పోర్ట్, ఫొటోతో ఉన్న బ్యాంకు పాస్‌బుక్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, ఉపాధి హామీ పథకం కార్డు, కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు, సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన గుర్తింపు కార్డు, ఎన్‌పీఆర్ కింద ఆర్బీఐ జారీ చేసిన గుర్తింపు కార్డు.. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, ఫొటోతో కూడిన పింఛను పత్రం, వీటిలో ఏదో ఒకటి చూపి ఓటు వేయవచ్చు.
ఓటుందో లేదో ఎలా తెలుసుకోవాలి? :https://electoralsearch.eci.gov.in/ లేదాhttps://eci.gov.inలేదా ceotelangana.nic.in లేదా voterhelplineApp వీటిలో ఏదోఒక దాని ద్వారా ఓటు ఉందో లేదో పరిశీలించుకోవచ్చు. అలాగే పోలింగ్ బూత్‌లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు.
ఎన్నికల వేళ ఎవరైనా అక్రమాలకు పాల్పడుతుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి? :పోలింగ్ సమయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే .. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. 100 నంబరుకు, ఈసీ ఏర్పాటు చేసిన 1950 హెల్ప్‌లైన్ నంబరుకు ఫోన్ చేసి చెప్పవచ్చు. సీ-విజిల్ యాప్ ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చు.