Telangana Assembly Elections Counting Arrangements 2023: తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఈవీఎంలను భద్రపరిచారు. ఈనెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీని కోసం జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు.
Telangana Assembly Elections 2023 :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లాలో 79.86 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 77.20 శాతం, బోథ్ నియోజకవర్గంలో 82.93 నమోదు అయ్యింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 80.82 శాతం నమోదు కాగా.. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 80.48, సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలో 81.16 శాతం నమోదు అయ్యింది. మంచిర్యాల జిల్లాలో 75.59 శాతం పోలింగ్ నమోదు కాగా... మంచిర్యాల నియోజకవర్గంలో 69.06 శాతం, చెన్నూరు 79.97 బెల్లంపల్లి 81.19 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. నిర్మల్ జిల్లాలో 78.24 శాతం పోలింగ్ నమోదు కాగా.. నిర్మల్ నియోజకవర్గంలో 76.66 శాతం, ముథోల్ 80.54, ఖానాపూర్ 77.46 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉమ్మడి వరంగల్‌లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్తతలు - పోలీసుల లాఠీ ఛార్జీ
Concern of Congress leaders In Mancherial: మంచిర్యాల జిల్లా భీమారంలో బీఆర్ఎస్ నాయకులకు సంబంధిన నంబర్ ప్లేటు లేని వాహనాలను పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకువచ్చారని ఆరోపిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. అక్కడే ఉన్న పోలీసులు, సిబ్బంది ఎందుకు అడ్డుకొలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అక్కడికి చేరుకొని పోలీసులను నిలదీశారు. ఏ విధంగా పోలింగ్ కేంద్రంలోకి వారిని అనుమతించారని ప్రశ్నించారు. అనంతరం రామగుండం సీపీకి ఫిర్యాదు చేశారు. గొడవ సద్దుమణిగిన అనంతరం ఈవీఎంలను ప్రత్యేక పోలీసులు బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు.
BRS leaders attacked BSP Leaders in Sirpur khagaznagar : సిర్పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ కార్యకర్తలపై బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడాన్ని ఆ నియోజకవర్గ అభ్యర్థి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. కాగజ్‌నగర్ మండలం పాత సర్సాల పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే కోనేరు కొనప్ప అనుచరులు తమ కార్యకర్తలపై కర్రలతో దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు.
ఈవీఎంల మొరాయింపులు, వాగ్వాదాలు, ఉద్రిక్తతలు, లాఠీఛార్జిల మధ్య ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శాసనసభ పోలింగ్ ముగిసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గిపోయింది. ముఖ్య నాయకులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్యల కారణంగా, చివరి క్షణంలో ఓటర్లు తరలి వచ్చిన చోట పలు కేంద్రాల్లో సాయంత్రం ఐదు తర్వాత పోలింగ్ కొనసాగింది.