Telangana Assembly Elections Campaign 2023 : తెలంగాణ చైతన్య పూదోట ఆటా-పాట. నాటి నుంచి నేటి వరకు సామాజిక చైతన్యంలో పాటది ప్రత్యేక స్థానం. కన్నీళ్లోచ్చినా.. కష్టాలొచ్చినా.. సంబరాలు అంబరాన్నంటినా పాటై ప్రజల మనస్సుల్లోకి చొచ్చుకు పోయింది. తెలంగాణ ఉద్యమానికీ ఊపిరి పోసింది పాట. పోరాటాన్ని ఉరకలెత్తించింది. భావోద్వేగాల్ని తట్టిలేపింది. తెలంగాణ ఉద్యమాన్ని పల్లెపల్లెకు గడగడపకు తీసుకెళ్లింది. ప్రజల్ని ఇంతగా ప్రభావితం చేసే పాటల్నే ప్రస్తుత ఎన్నికల్లో పార్టీలు ప్రచార అస్త్రంగా ఎంచుకున్నాయి. పల్లెపదాలతో ప్రజల మనసుల్లోకి సులువుగా చొచ్చుకుపోయేలా పాటల్ని రూపొందించాయి. బీఆర్‌ఎస్ రూపొందించిన రామక్క పాట(Ramakka Pata Viral) ఊరువాడ దుమ్మురేపటంతో మిగతా పార్టీలు అదే బాటను అనుసరించాయి. కాంగ్రెస్, బీజేపీలు సైతం రామక్క అంటూ పేరడి పాటలతో బీఆర్ఎస్కు పోటీగా ప్రజాక్షేత్రంలో మార్మోగిస్తున్నాయి.
'30 తారీఖు మన వేలి మీద ఇంకు.. ఆ తర్వాత స్టేట్ అంతా పింకే పింకు'.. BRS నేతల నెక్స్ట్ లెవెల్ ప్రచారం
BRS Ramakka Song : సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలున్నా.. పాట త్వరగా స్పందింపజేస్తుంది. జనాల మనస్సులోకి సులువుగా చొచ్చుకుపోతుంది. అందుకే నాటి నైజాం కాలం నుంచి నేటి వరకు ప్రజా చైతన్యంలో పాట కీలక భూమికను పోషించింది. తెలంగాణ ఉద్యమానికి ఆజ్యంగా తోడైంది పాట. జానపదుల నుంచి పుట్టుకు వచ్చిన వేలాది పాటలు తెలంగాణ సమాజాన్ని ఉద్యమం వైపు నడిపించాయి. పాటకున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన పార్టీలు ఎన్నికల్లోఇదే అస్త్రంతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. బీఆర్‌ఎస్ రూపొందించిన రామక్క పాట తెలంగాణలో దుమ్మురేపుతోంది.
Congress Paradi Song on CM KCR : తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ చేసిన పోరాటం, గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి, తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్ని పాట రూపంలో కళ్లకు కట్టినట్లు రూపొందించింది. ‘గులాబీల జెండాలే రామక్క అంటూ(Ramakka Song).. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తాండ్ర గ్రామానికి చెందిన గాయకులు కొమ్ము లక్ష్మమ్మ, బొల్లె సుశీల, శాంతమ్మ, కలమ్మ, అనసూయ, సంగీత దర్శకుడు కల్యాణ్ కీస్ బృందం రూపొందించిన పాట.. తెలంగాణే కాదు.. విదేశాల్లోనూ మార్మోగుతోంది.