Telangana 2023 Assembly Elections: రాష్ట్రంలో కాస్తా ముందస్తుగానే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. శాసనసభకు డిసెంబర్ వరకు ఎన్నికలు జరగాల్సి ఉంది. గడువు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు తమ కార్యాచరణను ప్రారంభించాయి. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి రెండు మార్లు అధికారాన్ని దక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. ముచ్చటగా మూడోసారి గెలుపొంది అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.
గత తొమ్మిదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రధాన అజెండాగా బీఆర్ఎస్ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తోంది. ఆత్మీయ సమ్మేళనాల పేరిట అధికార పార్టీ నేతలు ఊరూవాడా చుడుతున్నారు. కేసీఆర్ సర్కార్ అమలు చేసిన, చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వాటి వల్ల కలిగిన లబ్దిని వివరిస్తున్నారు. ఈనెల 25న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహించనున్నారు.
క్షేత్రస్థాయిలోనూ రాజకీయంగా ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే సమయంలో జాతీయ రాజకీయాలే లక్ష్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరణపై దృష్టి కేంద్రీకరించారు. ప్రభుత్వ పరంగానూ ఇంకా అమలు చేయాల్సిన హామీలు, కార్యక్రమాలను పట్టాలెక్కించే దిశగా కసరత్తు జరుగుతోంది.
మూడోమారు ముఖ్యమంత్రిని చేయాలి: ఇటీవల జరిగిన అంబేడ్కర్ విగ్రహావిష్కరణతో పాటు త్వరలో జరగనున్న సచివాలయం, అమరుల స్మారకం ప్రారంభోత్సవాల ద్వారా ప్రజల్లోకి మరింత స్పష్టమైన సంకేతాలు పంపేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రులు.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే విపక్షాల వైఖరిని ఎండగడుతున్నారు.కేసీఆర్ రుణం తీర్చుకోవాలని మూడోమారు ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల్లో సెంటిమెంట్ ను రగిల్చే అంశాలను ఎంచుకొని ముందుకెళ్తున్నారు.
విపక్షాలు సైతం దూకుడుగానే: అటు విపక్షాలు సైతం దూకుడుగానే ప్రజల్లోకి వెళ్తున్నాయి. సర్కార్ వైఫల్యాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయా వర్గాల వారీగా ప్రభుత్వం నెరవేర్చాల్సిన హామీలు, అంశాలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ వెళ్తున్నారు. ఇటీవలి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ ఉదంతం ఆధారంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోని నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా నిరుద్యోగ ర్యాలీ, సభలు నిర్వహించనుంది.
ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు పాదయాత్రలు చేస్తుండగా ఇప్పుడు ఆయా జిల్లాల్లో బహిరంగసభలు నిర్వహించనున్నారు. 24, 26, 28, 30 తేదీల్లో వరుసగా ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్నగర్లో సభలు తలపెట్టారు. మే ఒకటో తేదీన రంగారెడ్డి జిల్లాలో తలపెట్టిన భారీ సభకు అగ్రనేత ప్రియాంకాగాంధీని ఆహ్వానిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ మరింత దూకుడుగా వెళ్తోంది. పార్లమెంటరీ ప్రవాస్ యోజన పేరిట పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.
బీజేపీకి ఒక్కసారి అధికారం ఇవ్వాలంటూ:వరంగల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించిన బీజేపీ తదుపరి ఈనెల 25న పాలమూరులో మార్చ్ నిర్వహించనుంది. ప్రవాస్ యోజనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 23న చేవెళ్లలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక నుంచి ప్రతి నెలా ఒక అగ్రనేత రాష్ట్రంలో పర్యటించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బీజేపీకి ఒక్కసారి అధికారం ఇవ్వాలంటూ జనంలోకి వెళ్తున్నారు.