Telangana Assembly Elections 2023 : ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వినియోగాన్ని అరికట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. ఇందుకోసం తొలిసారి 20కి పైగా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను రంగంలోకి దింపేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల సన్నద్ధతపై ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో.. తెలంగాణలో జరుగుతున్న డబ్బు ఖర్చు తీరుపై ఈసీ ఉన్నతాధికారుల బృందం ఆందోళన వ్యక్తం చేశారు.
Enforcement Agencies in Telangana :రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని కట్టడి చేయడానికి ఈ ఏజెన్సీలను పకడ్బందీగా ఉపయోగించుకోవాలని ఈసీ ఆలోచిస్తోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో పోలీసు శాఖ, ఎక్సైజ్, ఇంటెలిజెన్స్, ఆదాయ పన్ను, సీఐఎస్‌ఎఫ్, రైల్వే తదితర విభాగాలు తనిఖీలు చేస్తుంటారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఆయా విభాగాల ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహించి వారిని సమన్వయం చేస్తుంది.
ఈసారి మరిన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను రంగంలోకి దించాలని ఈసీ డిసైడ్ అయ్యింది. పై విభాగాలతో పాటు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ), రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు (ఎన్‌సీబీ), కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ విభాగాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), విదేశీ వ్యవహారాల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోర్ట్స్, రవాణా తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేసింది.