Telangana Assembly Election Nominations Starts From November 3rd :తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ (Vikas Raj on TS Election Arrangements) తెలిపారు. అత్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించనున్నామని చెప్పారు. ఈ ప్రక్రియకు ముందు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందుకోసం గవర్నర్ అనుమతి తీసుకున్నామని వికాస్‌రాజ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వికాస్‌రాజ్ తెలిపారు. ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాలు, నామినేషన్ల ప్రక్రియలో నియమ నిబంధనలు, వ్యయ పరిశీలకులు, ఎన్నికల భద్రత, ఉచితాల స్వాధీనాలు తదితర అంశాలను ఆయన వివరించారు.
10లోగా కొత్త వారికి ఓటు హక్కు :తుది ఓటర్ల జాబితా ప్రకటించాక కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని వికాస్‌రాజ్ పేర్కొన్నారు. ఇప్పటికే నిర్ధారించిన 35,356 పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరిన్ని అనుబంధ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వస్తున్నాయని చెప్పారు. దీనిపై ఈ వారంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ నవంబరు 10వ తేదీలోగా ఓటు హక్కు కేటాయిస్తామని తెలిపారు. పోలింగ్ సమయంలో ఆ ఓటర్ల జాబితానే ప్రామాణికంగా తీసుకుంటామని వికాస్‌రాజ్ వివరించారు.
Nominations Process in Telangana Assembly Election 2023 :నామినేషన్లను ఆన్‌లైన్‌లోనూ దాఖలు చేయవచ్చని వికాస్‌రాజ్ వివరించారు. అవే పత్రాలను సంబంధిత ఎన్నికల అధికారికి ప్రత్యక్షంగా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారుల గదిలో ఏర్పాటు చేసిన గోడ గడియారంలోని సమయమే ప్రామాణికమని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్ల స్వీకరణ నిలిపేస్తామని వికాస్‌రాజ్ అన్నారు.
ఈ ప్రక్రియను సీసీ టీవీల ద్వారా రికార్డు చేస్తామని వికాస్‌రాజ్ పేర్కొన్నారు. ఒక్కో అభ్యర్థి నాలుగు నామినేషన్ల వరకు వేయవచ్చని అన్నారు. అఫిడవిట్ల విషయంలో అభ్యర్థులు పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. అభ్యర్థులిచ్చిన అఫిడట్లను అదే రోజు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి కార్యాలయంలోని నోటీసు బోర్డులోనూ పెడతామని వికాస్‌రాజ్ వివరించారు.