Telangana Assembly Election Campaign Ends Today : బహిరంగసభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు, ర్యాలీలు, పాదయాత్రలతో.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Telangana Election Campaign) హోరెత్తింది. శాసనసభ ఎన్నికలకు అక్టోబర్ తొమ్మిదో తేదీన ప్రకటన వెలువడగా.. ఈనెల మూడో తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. ప్రకటన కంటే ముందే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక ప్రచార పర్వం మరింత ఉద్ధృతంగా సాగింది.
Telangana Election Campaign Concludes Today :అధికార భారత్ రాష్ట్ర సమితి(BRS)తో పాటు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ విస్తృతంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. మజ్లిస్, బీఎస్పీ, వామపక్షాలు సహా ఇతర పార్టీలు, స్వతంత్రులు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి. ఆయా పార్టీల తరపున అగ్రనేతలు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షో(Road Shows)లలో పాల్గొన్నారు. తమ పార్టీ విధానాలను వివరిస్తూ, వైరి పక్షాల వైఖరిని ఎండగడుతూ ప్రచారాన్ని వేడెక్కించారు. విమర్శలు, ప్రతివిమర్శలతో ఎన్నికల ప్రచారం కదనరంగాన్ని తలపించింది. ఆయా పార్టీల తరపున ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో(Election Manifestos)లను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. గత కొన్నాళ్లుగా హోరెత్తించిన ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది.
'ఎన్నికలు అయిపోయే వరకు మీరే కాస్త సర్దుకోండమ్మా - ప్రచారాలు ముగియగానే మళ్లీ వచ్చి పనిలో చేరిపోతాం'
TS Election Polling on November 30th : పోలింగ్‌కు 48గంటల ముందు సైలెన్స్ పీరియడ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 13 నియోజకవర్గాల్లో పోలింగ్(Election Polling) 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. దీంతో ఆ 13 నియోజకవర్గాల్లో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సైలెన్స్ పీరియడ్ ప్రారంభంతో ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు, నిర్వహించరాదు.