తెలంగాణ

telangana

ETV Bharat / state

రణరంగాన్ని తలపిస్తున్న తెలంగాణ ఎన్నికలు, ఆ పార్టీల మధ్యే ప్రధాన పోరు

Telangana Assembly Election 2023 : రాష్ట్ర రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. అధికార పీఠంపై పాగా వేయడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ప్రజాక్షేత్రంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతూ వ్యూహ, ప్రతివ్యూహాలు.. ఎత్తుకు, పైఎత్తులతో ముందుకెళ్తున్నాయి. విమర్శలు , ప్రతి విమర్శలు.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో శీతలంలోనూ వేడి వాతావరణంతో రాజకీయం రంజుగా మారింది. అగ్రనేతల పర్యటనలు, ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. హమీలు, మ్యానిఫెస్టోలు, భరోసా, గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్తున్న నేతలు.. పరస్పర ఆరోపణలు, సవాళ్లతో విరుచుకుపడుతున్నారు. జంప్ జిలానీలు పార్టీలను ఇట్టే మారుస్తున్నారు. పాటలు, కళారూపాలు, సరికొత్త ప్రచారశైలితో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు.

Telangana Assembly Election 2023
Telangana Assembly Election 2023

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2023, 6:08 AM IST

రణరంగాన్ని తలపిస్తున్న తెలంగాణ ఎన్నికలు, ఆ మూడు పార్టీల మధ్యే ప్రధాన పోరు

Telangana Assembly Election 2023 :అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటు కోసం జరుగుతున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాజకీయ పార్టీలన్నీ కదనరంగంలోకి దూకాయి. ఎలాగైనా మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయి. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార భారత రాష్ట్ర సమితి ప్రయత్నిస్తోంది.

2014, 2018 ఎన్నికల్లో ఘనవిజయంతో రాష్ట్ర పాలనా పగ్గాలను దక్కించుకొన్న కేసీఆర్ నేతృత్వంలోని గులాబీ దళం హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టింది. పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టి అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అన్న నినాదంతో ఎన్నికలను ఎదుర్కొంటోంది.

తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ బీఆర్​ఎస్​ మాత్రమేనని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల వేళ మాయ మాటలకు మోసపోవద్దని ఓటర్లకు వివరిస్తూనే.. కాంగ్రెస్‌, కమలం పార్టీ వస్తే కరెంట్‌ కష్టాలు వస్తాయని.. మళ్లీ కరవు తప్పదని అభివృద్ధిలో అథోగతే శరణ్యం అంటూ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ దళం ప్రచారపర్వంలోనూ మిగతా పార్టీల కంటే భిన్నంగా దూసుకెళుతోంది. సరికొత్త హామీలతో కూడిన మేనిఫెస్టోను ఇప్పటికే ప్రకటించింది.

హ్యాట్రిక్​పై కన్నేసిన గులాబీ దళం : గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే రోజుకు రెండు, మూడు చొప్పున నియోజకవర్గాలను చుట్టేస్తుండగా.. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా మిగతా అమాత్యులు అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పదేళ్ల అభివృద్ధిని వివరిస్తూనే మరోసారి పట్టం కడితే చేపట్టబోయే పనులను ఏకరవు పెడుతున్నారు. గులాబీ పార్టీ దిల్లీకి గులామ్‌ కాదని.. తమ బాస్‌లు తెలంగాణ గల్లీల్లోనే ఉంటారంటూ ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.

ప్రజల అభీష్టం, అవసరాలు తెలిసిన గులాబీ పార్టీనే మరోసారి ఆశీర్వదించాలంటూ ప్రజాక్షేత్రంలో అభ్యర్థిస్తున్నారు. సబ్బండ వర్గాల సంక్షేమం తమ అభిమతమంటూ.. దశాబ్దికాలంలో చేసిన ప్రగతి పనులు రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపామంటూ అప్రతిహత ప్రగతి ఆగొద్దంటే.. మళ్లీ బీఆర్​ఎస్​నే గెలిపించాలని గులాబీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

24 గంటల విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, సాగు ప్రాజెక్టులతో కోటి ఎకరాల మాగాణి, ఆసరా పింఛన్లు, కేసీఆర్‌ కిట్‌, దళిత బంధు, రెండుపడక గదుల ఇళ్లు , పల్లె-పట్టణ ప్రగతి పథకాల అమలును ప్రస్తావిస్తున్నారు. బీఆర్​ఎస్ ప్రచారాన్ని గులాబీ దళపతి తన భుజాలపై వేసుకుని సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. రోజుకి మూడు నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తూ.. పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తున్నారు. కేసీఆర్ భరోసా పేరిట వచ్చేసారి గెలిపిస్తే చేపట్టబోయే పనులను ప్రజలకు విడమరిచి చెబుతున్నారు. కాంగ్రెసోళ్లకు పాలనా పగ్గాలు అప్పగిస్తే.. ధరణిని ఎత్తివేస్తారని మళ్లీ దళారుల రాజ్యం రావటం ఖాయమని సీఎం ఆందోళన వ్యక్తంచేశారు.

Telangana Election BRS Plan :రాష్ట్రంలో అభివృద్ధి చేరని ఇల్లు లేదు ప్రగతి లబ్ధి పొందని ఓటరు లేరు అంటూ పదేళ్ల ప్రగతిని వీధివీధిన, ఊరూవాడన, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజల వద్దకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ నేతలు. గోదావరిపై కడుతున్న ప్రాజెక్టులతో కోటి ఎకరాల మాగాణంతో పాటు కృష్ణా జలాల్లో వాటాపై రాజీపడని పోరు చేసే పార్టీ తమదేనంటూ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తాత్కాలిక తాయిలాలు, ప్రలోభాలకు లొంగితే వచ్చే ఐదేళ్లు రాష్ట్ర భవిష్యత్‌ ప్రమాదంలో పడుతుందని నొక్కిఒక్కాణిస్తున్నారు.

ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ యాభై ఏళ్లు పాలించినా చేసిన అభివృద్ధి శూన్యమని.. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చిన నిధులు లేకపోగా.. విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన వాటిని విస్మరించారంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. పదేళ్లలో కర్ఫ్యూ, కరవు లేకుండా సుభిక్షంగా ఉన్న రాష్ట్రాన్ని ఇతర పార్టీలను విశ్వసించి సంక్షోభంలోకి నెట్టొద్దని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం మొదలు మంత్రులు విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

3వ తేదీ తర్వాత తిరిగి మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది : కేటీఆర్

Telangana Congress Election Plan :ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ.. రెండు ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ..ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని కసితో ప్రజాక్షేత్రంలో చావో రేవో అన్నట్లు కొట్లాడుతోంది. ఇటీవలి కర్నాటక ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో రాష్ట్రంలోనూ అదే తరహా వ్యూహాలను అమలుచేసి అధికారం చేజిక్కించుకోవాలని ముందుకెళుతోంది. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ప్రధానంగా ఎత్తిచూపుతోంది. ఉద్యోగాల భర్తీలో విఫలం, పూర్తి రుణమాఫీ అమలుచేయకపోవడం , రెండు పడకగదుల ఇళ్లు ఇవ్వకపోవడం, దళితబంధు పాక్షిక అమలు, అన్నదాతల ఆత్మహత్యలు, పంటలకు మద్దతు ధర కల్పించకపోవడం లాంటివి గాలికొదిలేసిందని ప్రధాన విపక్ష నేతలు విమర్శిస్తున్నారు .

ఈసారి తెలంగాణపై కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే పలుమార్లు రాష్ట్రాన్ని చుట్టేశారు. భారీ బహిరంగసభలతో పాటు రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లతో ప్రజలను కలుస్తున్నారు. ధరణి పోర్టల్‌తో భారాస నాయకులు పేదల భూములు కొల్లగొట్టారంటూ..కాళేశ్వరం కల్వకుంట్ల కుటుంబానికి ATMలా మారిందంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో కమీషన్ల దందాకు తెరలేపి.. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేశారంటూ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగుడుతూ... చాలా హామీలను తుంగలో తొక్కారని అగ్రనేత రాహుల్‌ ప్రతీ మీటింగ్‌లోనూ భారాసపై విరుచుకుపడుతున్నారు.

పదేళ్ల హయాంలో అమలు చేయని హామీలను ప్రస్తావిస్తూ వెళ్తోంది. ఆయా వర్గాలే లక్ష్యంగా గ్యారంటీలను ప్రకటించి వాటిని నమ్ముకునే ఎన్నికలను ఎదుర్కొంటోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్కతో పాటు ఇతర ముఖ్యనేతలు ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. రాష్ట్రమంతా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల దగ్గరకు వెళుతున్నారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని భరోసాగా చెబుతున్నారు. దొరల తెలంగాణను సామాజిక, ప్రజా తెలంగాణగా మార్చాలంటే కాంగ్రెస్‌కే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Telangana BJP Election Plan :డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో విజయంపై కన్నేసింది. రెండు చోట్లా బీజేపీ ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి మరింత పరుగులు పెడుతుందంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. బీఆర్​ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ.. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కార్యక్రమాలు ప్రధాన అస్త్రాలుగా ఎన్నికలకు వెళ్తోంది. జనసేనతో కలిసి పోటీ చేసే విషయమై కసరత్తు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు ఇప్పటికే ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఈటల, బండి సంజయ్, తదితరులు ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకుని రాష్ట్రమంతా కలియతిరుగుతున్నారు. అసెంబ్లీ సీట్ల కేటాయింపులో బీసీలకు అధిక ప్రాధాన్యమిస్తూనే.. గెలిస్తే వెనకబడిన వర్గాలకు చెందిన వ్యక్తికే సీఎం పదవి అప్పజెప్తామంటూ కేంద్ర హోంమంత్రి, కమలం అగ్రనేత అమిత్‌ షా ప్రకటించారు.

దూకుడు మీదున్న మజ్లిస్​లు :పాతబస్తీలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోన్న మజ్లిస్ పార్టీ.. మరోమారు అదే వ్యూహంతో ముందుకెళుతోంది. పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో పాటు శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఇప్పటికే ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. పార్టీ అభ్యర్థులు పోటీలో లోని చోట భారాసకు ఓటు వేయాలని ఒవైసీ పిలుపు ఇస్తున్నారు. వామపక్షాలైన సీపీఎం, సీపీఐ కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపినా...కొలిక్కి రాక ఉమ్మడిగా కనీసం 15 స్థానాల్లో నైనా పోటీచేయాలని భావిస్తున్నాయి.

ఎన్నికకు దూరంగా ఉన్న టీడీపీ : విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బహుజన సమాజ్ పార్టీ మెజార్టీ స్థానాల్లో తన అభ్యర్థులను బరిలో దింపుతోంది. షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్​టీపీ అభ్యర్థులు కొన్నిచోట్ల ఎన్నికల బరిలో నిలుపుతోంది. తెలుగుదేశం, తెలంగాణ జనసమితి పార్టీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. టీజేఎస్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయనుంది. కేఏపాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీ, యుగతులసి సహా మరికొన్ని పార్టీలు తమ అభ్యర్థులను అక్కడక్కడ నిలబెడుతున్నాయి.

రేపు ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణకు భారీ ఏర్పాట్లు

తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాలు

ABOUT THE AUTHOR

...view details