Telangana Assembly Election Campaign 2023 : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం (Telangana Assembly Election Campaign) ఊపందుకుంది. ఓ వైపు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ముఖ్య నాయకులతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇదే సమయంలో అభ్యర్థులు.. తమ అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ.. ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ కోసం కొందరు.. మరో ఛాన్స్ కోసం మరికొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడటం లేదు.
అన్నా ఎటుపోతాంది రాజకీయం - తెలంగాణలో ఏడజూసినా గిదే ముచ్చట
ఫలితంగా అభ్యర్థులు గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడ తిరుగుతున్నా.. హంగూ ఆర్భాటాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ వెంట ఎంత మంది ఎక్కువగా ఉంటే.. అంత ప్రజాబలం ఉన్నట్లుగా ఓటర్లు భావిస్తారని వారు నమ్ముతున్నారు. తద్వారా పెద్ద సంఖ్యలో జనాలను పోగు చేయడంపై దృష్టి పెట్టారు. మరోవైపు గ్రామ, పట్టణస్థాయి నేతలు తమ పార్టీల అభ్యర్థుల తరపున.. ఓటర్లను కలిసేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటింటికీ తిరుగుతున్నారు. వారు కూడా కనీసం 50 నుంచి 100 మందితో కదులుతున్నారు. ఇందుకోసం రోజువారీ కూలీలపై ఆధారపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రచారంలోనే పాల్గొనేవారికి ఒకపూట పాల్గొంటే కనీసం రూ.300 ఇచ్చేలా.. ఉదయం, సాయంత్రం రెండుపూటలా పాల్గొంటే రూ.500 ఇచ్చి, భోజనం పెట్టేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రచారానికి వస్తున్న వారు.. తమ కూలీని ఎప్పటికి అప్పుడే తీసుకుంటున్నారు. వారానికోసారి ఇస్తామంటే ఒప్పుకోవడం లేదు. సాయంత్రం ప్రచారం ముగిసిన వెంటనే గ్రామాల్లో ఆయా పార్టీల నేతల ఇంటివద్ద క్యూ కడుతున్నారు. ఒకవేళ ఏదేని సమస్యతో నగదు చెల్లింపులో ఆలస్యం చేస్తే.. మరుసటి రోజున వచ్చేందుకు నిరాకరిస్తున్నారు.