రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగో రోజు రుణమాఫీ పథకం కింద 10,958 మంది రైతుల ఖాతాలకు రూ.39.40 కోట్ల నిధులు బదిలీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నాలుగు రోజుల్లో 61,752 మంది రైతులకు రూ.175.96 కోట్ల రుణమాఫీ చేశామని వివరించారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా రుణాల నుంచి రైతులు విముక్తి కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కరోనా విపత్తులోనూ రైతు శ్రేయస్సు దృష్ట్యా వ్యవసాయ పంటల ఉత్పత్తులు 100 శాతం కొనుగోలు చేశామని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లలో వ్యవసాయరంగ స్వరూపం మారిందని హర్షం వ్యక్తం చేశారు.
దేశంలో ఎక్కడా లేని పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టి.. విజయవంతంగా అమలు చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణలో ప్రతి కుటుంబాన్ని అభివృద్ధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.