ఇటీవల 2020-2021కి సంబంధించి వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో నిర్ణయించింది. నియంత్రిత సాగు విధానం అమలు చేయాలని నిర్ణయించింది. అయితే, ఈ లెక్కలు వాస్తవంగా అనుసరణలోకి రాలేదు. వరి విస్తీర్ణం ఒక్కటే పెరిగిందని... ఇతర పంటల సాగు తగ్గిందని వ్యవసాయ శాఖ నివేదిక తెలిపింది. జొన్న, కంది, పెసర, నువ్వులు, సోయాబీన్, చెరకు, పొద్దు తిరుగుడు, వేరుశనగ, ఆముదం, ఇతర నూనె గింజల విస్తీర్ణం గణనీయంగా తగ్గిందని వెల్లడించింది. మొక్క జొన్న విస్తీర్ణం గురించి ప్రణాళికలో ప్రస్తావించకపోయినప్పటికీ.....సుమారు 2 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు నివేదిక చెబుతోంది. పత్తి సాగు సైతం ప్రభుత్వ అంచనాలను అందుకోలేదని పేర్కొంది.
దిగుమతులే దిక్కు
వరి మినహా ఇతర పంటల సాగు గణనీయంగా తగ్గడం వల్ల.... దిగుమతుల మీద ఆధార పడాల్సి వస్తుంది. ఎరువులు, పురుగు మందుల వాడకం పెరగటం వల్ల విస్తీర్ణం తగ్గిందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం వల్ల.. రాష్ట్ర ప్రభుత్వం చివరి నిమిషం వరకూ పంటల ప్రణాళిక రూపొందించకపోవటం ఇందుకు కారణమని చెబుతున్నారు. ఫలితంగా రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేయాల్సి వచ్చిందన్నారు.