తెలంగాణ

telangana

By

Published : Dec 31, 2019, 6:33 AM IST

Updated : Dec 31, 2019, 7:31 AM IST

ETV Bharat / state

ఆర్థికాభివృద్ధిలో తెలంగాణదే అగ్రస్థానం

నీతి ఆయోగ్​ ప్రకటించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక 2019-20లో దేశంలోనే  తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. అన్ని విభాగాల్లో కలిపి తెలంగాణ రాష్ట్రం ఐదో స్థానంలో ఉంది. అసమానతల తగ్గింపులో మొదటి స్థానంలో నిలిచినా.. లింగ సమానత్వంలో వెనుకబడి ఉంది.

telangana-achieve-first-rank-in-economic-developments
ఆర్థికాభివృద్ధిలో తెలంగాణయే అగ్రస్థానం

ఆర్థికాభివృద్ధి, అసమానతల తగ్గింపుంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. లింగ వివక్ష మాత్రం తీవ్రంగా ఉంది. ఆహార భద్రతలోనూ రాష్ట్రం వెనుకబాటులో ఉంది. నీతి ఆయోగ్​ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక 2019-20లో అన్ని విభాగాల్లో కలిపి తెలంగాణ దేశంలో ఐదో స్థానంలో నిలిచింది. జాతీయ సగటు కంటే మెరుగైన స్థానంలో ఉంది.

జాతీయ సగటు 60 పాయింట్లు కాగా.. తెలంగాణ 67 పాయింట్లను సాధించింది. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పన పెరిగింది. ప్రసూతి మరణాల సంఖ్య తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే పలు అంశాల్లో పురోగతిని సాధించగా.. మరి కొన్నింటిలో వెనుకంజలో ఉంది.

అభివృద్ధి లక్ష్యాల సూచికల్లో ఇదీ వరుస

  • ఆర్థిక వృద్ధిలో అగ్రస్థానంలో తెలంగాణ (82 పాయింట్లు)
  • అసమానతల తగ్గింపులో ప్రథమ స్థానం(94పాయింట్లు)
  • చౌక, శుద్ధ ఇంధనం ( క్లీన్​ ఎనర్జీ)లో మూడో స్థానం(93పాయింట్లు)
  • సుస్థిర నగరాల్లో ఐదో స్థానం(62పాయింట్లు)
  • మంచి ఆరోగ్యం, శ్రేయస్సులో పదో స్థానం(66పాయింట్లు)
  • నాణ్యమైన విద్యలో పదకొండో స్థానం(64పాయింట్లు)
  • పరిశ్రమలు, నూతన ఆవిష్కరణల్లో పదకొండో స్థానం(61పాయింట్లు)
  • పేదరిక నిర్మూలనలో 13వ స్థానం(52పాయింట్లు)
  • స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రతలో 13వ స్థానం(84పాయింట్లు)
  • ఆహార భద్రతలో 18వ స్థానం(37 పాయింట్లు)

ఇదీ పురోగతి

  • జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పన గతేడాది 77.06 శాతం ఉండగా.. ఇప్పుడు 84.40 శాతానికి చేరింది.
  • గర్భిణులకు సామాజిక పథకాల ద్వారా ప్రయోజనాల కల్పనలో నిరుటి స్థానం యథాతథంగా ఉంది. ప్రసూతి మరణాల సంఖ్య 81 శాతం నుంచి 76 శాతానికి తగ్గింది.
  • వ్యక్తిగత మరుగుదొడ్లు గల ఇళ్ల సంఖ్య గతేడాది 82.28 శాతం ఉండగా ఇప్పుడు అది వంద శాతానికి చేరింది. గతేడాది 20 శాతం జిల్లాల పరిశీలన జరగగా ఈ ఏడాది 66.67 జిల్లాల్లో పరిశీలన జరిగింది.
  • గతేడాది వరకు 96.91 ఇళ్ల విద్యుదీకరణ జరగ్గా.. ఈ ఏడాది అది వంద శాతానికి చేరింది.
  • ప్రధాన మంత్రి గ్రామీణ సడక్​ యోజనతో గ్రామీణ రోడ్ల అనుసంధానం 16.36 శాతం నుంచి 63 శాతానికి చేరింది.
  • ప్రధానమంత్రి ఆవాస్​ యోజనలో ఇళ్ల నిర్మాణం 0.7 శాతం నుంచి 38.64 శాతానికి చేరింది.
  • ఇంటింటా పూర్తిస్థాయిలో చెత్త సేకరణ గల వార్డులు గతేడాది 64.63 శాతం ఉండగా.. ఈ ఏడాదివాటి సంఖ్య 95.6 శాతానికి చేరింది.
  • వృథాజలాల శుద్ధి గతేడాది వరకు 67 శాతం ఉండగా.. ఈ ఏడాది అది 78 శాతానికి చేరింది.
  • గతేడాది లక్షకు 2.80 మంది చొప్పున హత్యలు జరగగా.. ఈ ఏడాది అది 2.17 శాతానికి తగ్గింది.
  • జనన, మరణాల నమోదు గతేడాది 94.60 శాతం ఉండగా ఇప్పుడు అది 97.34 శాతానికి పెరిగింది.

వీటిలో వెనుకంజ

  • వరి, గోధుమలు, తృణ ధాన్యాల ఉత్పత్తి గతేడాది హెక్టారుకు 2879.65 కిలోలు ఉండగా.. ఈ ఏడాది అది 2547.33 కిలోలకు తగ్గింది.
  • తక్కువ బరువు గల ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య 28.1 శాతం నుంచి 29.3 శాతానికి పెరిగింది
  • టీబీ మరణాల సంఖ్య గతేడాది ప్రతి లక్షకు 107 మంది ఉండగా..142కి పెరిగింది.
  • మధ్యలో బడి మానేసే వారి శాతం గతేడాది 15.53 ఉండగా.. 22.49 శాతానికి పెరిగింది.
  • గతేడాది జన్మించిన వారిలో మగ, ఆడ పిల్లల నిష్పత్తి 1000:901 ఉండగా.. ఈ ఏడాది ఆడపిల్లల సంఖ్య ఇంకా తగ్గి 897 మాత్రమే నమోదయ్యింది.
  • గతేడాది ప్రతి లక్ష మంది పిల్లల్లో 26 మందిపై అఘాయిత్యాలు జరగ్గా ఇప్పుడా సంఖ్య 32.1కి పెరిగింది.

ఇవీచూడండి: విశ్వానికీ ప్రభుత్వం ఉందట... దేవదేవతలకు శాఖలు ఉన్నాయట!

Last Updated : Dec 31, 2019, 7:31 AM IST

ABOUT THE AUTHOR

...view details