తెలంగాణ

telangana

కాసేపట్లో బడ్జెట్​ సమావేశాలు.. గవర్నర్​ ప్రసంగంతో ప్రారంభం

By

Published : Mar 6, 2020, 5:10 AM IST

Updated : Mar 6, 2020, 10:28 AM IST

బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో గవర్నర్ ప్రసంగంతో ఉభయసభల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం రాష్ట్ర వార్షిక పద్దు ప్రవేశపెడుతుండగా.. కొత్త రెవెన్యూ, గ్రేటర్ హైదరాబాద్ చట్టాల బిల్లులు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. పౌరసత్వ చట్టం విషయంలో తీర్మానం చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రైతు సమస్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమం, కరోనా తదితర అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తోంది.

telangana 2020-21 budget
నేటి నుంచి బడ్జెట్​ సమావేశాలు

నేటి నుంచి బడ్జెట్​ సమావేశాలు

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. గవర్నర్​గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్ మొదటిసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలతో పాటు భవిష్యత్ ప్రణాళికలు, కార్యాచరణను తమిళి సై.. ప్రసంగం ద్వారా వివరించనున్నారు.

శనివారానికి ఉభయసభలు వాయిదా

గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయసభలు శనివారానికి వాయిదా పడతాయి. ఆ తర్వాత సమావేశాల ఎజెండాను ఖరారు చేసేందుకు రెండు సభల.. సభా వ్యవహారాల సలహాసంఘాలు వేర్వేరుగా భేటీ అవుతాయి. బీఏసీ భేటీలో చర్చించి సమావేశాల పనిదినాలను ఖరారు చేస్తారు. సమావేశాల్లో చర్చించే అంశాలతో పాటు ప్రవేశపెట్టే బిల్లులు, తీర్మానాలను ప్రభుత్వం తెలుపనుంది.

బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న హరీశ్​ రావు

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రేపు ఉభయసభల్లో చర్చ జరగనుంది. చర్చకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇస్తారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్​ను ఈ నెల 8న ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు, మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారని సమాచారం.

బడ్జెట్​లో సంక్షేమం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలకు అధిక నిధులు ఉంటాయని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్​పై సాధారణ చర్చ, పద్దులపై చర్చతో పాటు ద్రవ్యవినిమయబిల్లుకు ఆమోదం పొందాల్సి ఉంటుంది.

సీఏఏపై వ్యతిరేక తీర్మానం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇతర రాష్ట్రాల తరహాలో తీర్మానం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కేబినెట్​లో ఈ మేరకు తీర్మానం కూడా చేశారు. అందుకు అనుగుణంగా బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేసే అవకాశం ఉంది. అటు కొత్త రెవెన్యూ చట్టం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్​కు కొత్త చట్టం బిల్లును ఈ సమావేశాల్లో చర్చకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. రైతు సమస్యలు, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, నీటిపారుదల, సంక్షేమరంగం, కరోనా పరిస్థితి తదితర అంశాలపై సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:ప్రైవేటు ఆస్పత్రికి కరోనా సోకిన ఇటలీ పర్యటకులు

Last Updated : Mar 6, 2020, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details