ప్రైవేట్ పాఠాశాలలు ఫీజుల వసూళ్లకు సంబంధించిన విషయంపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఉత్తర్వులు ఉల్లంఘించిన పాఠశాలలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఎన్ని పాఠశాలలపై ఫిర్యాదులందాయి? ఏం చర్యలు చేపట్టారో నివేదిక ఇవ్వాలంది. ఫీజుల గురించి మాట్లాడటానికి వెళ్లిన తల్లిదండ్రులపై బోయినపల్లిలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై కౌంటరు దాఖలు చేయాలంది. ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో అస్పష్టత ఉందని వ్యాఖ్యానించింది. ఒకే ఇంటిలో ముగ్గురు పిల్లలున్నపుడు, ఒకే టీవీ ఉన్నపుడు తరగతులు ఎలా వినాలని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను సెప్టెంబరు 18కి వాయిదా వేసింది. అనుమతుల్లేకుండా ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్, మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు నిర్ణయం
సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఏవైనా సందేహాలు వస్తే ఎలా తీర్చుకోవాలని, కూలీ అయిన తండ్రి, వంట చేసుకునే అమ్మ వారి సందేహాలు తీర్చలేరని, జామెట్రీలో వచ్చే సందేహాలను ఉపాధ్యాయులే పరిష్కరించగలరంది. గిరిజన ప్రాంతాల్లోని పేదల సంగతేమిటంది. దీనిపై న్యాయవాది స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో నెల రోజుల క్రితమే ఇది ప్రారంభమై విజయవంతమైందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ప్రస్తుతం గురుశిష్యుల సంబంధం ఎలా ఉంటుందోనని, అమలుపై సందేహాలున్నాయని వ్యాఖ్యానించింది.
తల్లిదండ్రుల నిర్ణయం తీసుకున్నారా?