తెలంగాణ

telangana

By

Published : Nov 14, 2020, 5:01 AM IST

ETV Bharat / state

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్​

సాదాబైనామాల క్రమబద్ధీకరణతో పాటు ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల నమోదు, లావాదేవీల కోసం ఆర్డినెన్స్ రానుంది. ఈ మేరకు సంబంధిత చట్ట సవరణ చేస్తూ ఆర్డినెన్స్​కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రిజిస్ట్రేషన్ల విభాగాన్ని పూర్తిగా రద్దు చేసి రెవెన్యూ ద్వారానే అన్ని రిజిస్ట్రేషన్లు చేసే అంశం కూడా కేబినెట్​లో ప్రస్తావనకు వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్​కు సంబంధించిన కొన్ని నిర్ణయాలతో పాటు వివిధ ఉద్యోగ నియామక ఉత్తర్వులకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం.. నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర సంస్థలను కోరాలని ముఖ్యమంత్రి తెలిపారు. బల్దియాతో పాటు రానున్న ఎన్నికల్లో మంత్రులు అందరూ కీలకంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు.

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్​
సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్​

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్​

సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం ఆర్డినెన్స్​ జారీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల ఖరారుతో పాటు రెవెన్యూ సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ధరణి పోర్టల్ బాగా పనిచేస్తోందని, రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు సులువుగా అవుతున్నాయని సీఎం తెలిపారు. పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను కూడా త్వరలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన కసరత్తు వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

చట్ట సవరణ చేయాలని నిర్ణయం..

సాదాబైనామాల క్రమబద్ధీకరణ విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. కొత్త చట్టం ప్రకారం సాదాబైనామాలు క్రమబద్ధీకరణకు చేయరాదన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చట్ట సవరణ చేయాలని నిర్ణయించారు. సాదాబైనామాలు క్రమబద్ధీకరణ చేసేలా భూమి హక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ధరణి పోర్టల్​లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుతో పాటు లావాదేవీలు నిర్వహించేలా కూడా చట్టాన్ని సవరించనున్నారు. ఆర్డినెన్స్ జారీ అనంతరం వీటి అమలుకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.

రెవెన్యూ ద్వారానే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు..

అటు రిజిస్ట్రేషన్ల విభాగాన్ని తొలగించాలన్న అంశం కూడా కేబినెట్​లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ధరణి సహా ప్రభుత్వ ఆలోచనలకు రిజిస్ట్రేషన్ల విభాగం సరిగా సహకరించడం లేదన్న భావన ఉంది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల విభాగాన్ని తొలగించి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు కూడా రెవెన్యూ ద్వారానే చేయాలన్న ప్రతిపాదనపై కూడా కేబినెట్​లో చర్చించినట్లు తెలిసింది. వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాల కోసం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా నియామక సంస్థలను కోరాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

గ్రేటర్​పై దృష్టి..

గ్రేటర్ హైదరాబాద్​కు సంబంధించిన అంశాలపై కూడా మంత్రివర్గంలో చర్చించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. భాగ్యనగరంలో పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్న సీఎం కేసీఆర్.. ఇంకా చాలా కార్యక్రమాలు చేపడతామన్నారు. బల్దియాతో పాటు రానున్న పట్టబద్రుల ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో మంత్రులు క్రియాశీలకంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయా జిల్లాల మంత్రులు పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:పెద్దల సభకు వెళ్తున్న ఈ ముగ్గురి నేపథ్యం తెలుసా...?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details