తెలంగాణ

telangana

ETV Bharat / state

MAHILA CONGRESS: మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలి పీఠం దక్కేదెవరికి..? - నూతన మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలి ఎంపికపై పార్టీ కసరత్తు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రక్షాళనలో భాగంగా నూతన మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలి ఎంపికపై కూడా కసరత్తు వేగవంతమైంది. రాష్ట్రానికి చెందిన నలుగురు మహిళా నేతల పూర్తి వివరాలు తెప్పించుకున్న జాతీయ మహిళా అధ్యక్షురాలు సుశ్మిత దేవ్‌... వారిని ఫోన్‌ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయడంతోపాటు మహిళల సమస్యలను పరిష్కరించే సత్తా కల్గిన నాయకురాలికే మహిళా అధ్యక్షురాలి పీఠం దక్కనుంది.

మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలి పీఠం దక్కేదెవరికి..?
మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలి పీఠం దక్కేదెవరికి..?

By

Published : Jun 23, 2021, 10:43 AM IST

కాంగ్రెస్‌ పార్టీలో... పీసీసీ అధ్యక్షుడి పదవికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే సమానంగా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలి పాత్ర ఉంటుంది. ఈ మహిళా విభాగం అధ్యక్ష పదవిలో ఉండే నాయకురాలు... పీసీసీతో సమానంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడంతో పాటు మహిళల సమస్యలను పరిష్కరించే దిశగా పని చేయాల్సి ఉంటుంది. కానీ సుదీర్ఘ కాలంగా తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా నేరెళ్ల శారద ఉన్నారు. ఆమె ఇటీవల కాలంలో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని, చురుగ్గా పాల్గొనడం లేదన్న భావన కాంగ్రెస్‌ నాయకుల్లో ఉంది. అందువల్ల నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికతోపాటు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలి ఎంపిక కూడా చేపట్టాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది.

ఫోన్ ద్వారా ఇంటర్వ్యూలు..

అందులో భాగంగానే కాంగ్రెస్‌ జాతీయ మహిళా అధ్యక్షురాలు సుశ్మిత దేవ్​ రంగంలోకి దిగి కసరత్తు మొదలు పెట్టారు. పీసీసీ అధికార ప్రతినిధులు సునీతారావు, భవానీరెడ్డి, ఇందిరా రావు, కాల్వ సుజాతలకు చెందిన పూర్తి బయోడేటాను జాతీయ అధ్యక్షురాలు తెప్పించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండు, మూడు రోజులుగా సుశ్మిత్ దేవ్ వారిని ఫోన్‌ ద్వారా ఇంటర్వ్యూ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వివిధ ప్రశ్నలు సందించిన ఈమె కొందరిని 20 నిముషాల నుంచి అరగంటపాటు, మరికొందరిని ఆరేడు నిముషాలు ఇంటర్వ్యూ చేశారు.

పార్టీకి సంబంధించిన ప్రశ్నలు..

తెలంగాణ రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్‌ ఎందుకు చురుకైన పాత్ర పోషించలేకపోతోంది, ప్రస్తుత అధ్యక్షురాలు ఎందుకు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు, ఒకవేళ మీకు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఇస్తే... పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళతారు వంటి ప్రశ్నలను సుశ్మిత్ దేవ్ అడిగినట్లు తెలిపారు. అలాగే పార్టీతో మీకున్న అనుబంధం ఏంటి, ఎంతకాలం నుంచి పార్టీలో పని చేస్తున్నారు, పార్టీలో ఏయే పదవులు చేపట్టారు తదితర అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలకు పీసీసీ నుంచి అందిన సమాచారంతో బేరీజు వేసుకుని తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆమెకే దక్కే అవకాశం...

పోటీలో ఉన్న నాయకురాళ్లల్లో పీసీసీ అధికార ప్రతినిధి సునీతారావుకు అధ్యక్ష పీఠం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈమె వృత్తి పరంగా న్యాయవాది అయినప్పటికీ... ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లలో కూడా పని చేసిన అనుభవం ఉంది. నగర కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలిగా, పీసీసీ అధికార ప్రతినిధిగా పని చేశారు. అదేవిధంగా మహిళా సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉండడం, భాషపై పూర్తి పట్టుండడం వంటి అంశాలతోపాటు పార్టీకి విధేయురాలిగా పని చేస్తున్న భావన కూడా పార్టీలో ఉండడంతో ఆమెకే ఈ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి:health department: రాష్ట్రంలో 3,766 వైద్యుల పోస్టులు ఖాళీ

ABOUT THE AUTHOR

...view details