ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యంలో భాగంగా రాష్ట్ర అబ్కారీ తరఫున ఈ ఏడాది కోటి మొక్కలు నాటాలని ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన కార్యాచరణ రూపకల్పన చేసుకోవాలని సూచించారు. సచివాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో కోటి మొక్కలు నాటేందుకు సర్కారు సన్నద్ధం - SRINIVAS GOUD
హరిత హారం పథకం కింద రాష్ట్రంలో కోటి ఈత, ఖర్జూర, తాటి మెుక్కలు యుద్ధ ప్రతిపాదికన నాటి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఇందులో ప్రతి ఒక్క అధికారి భాగస్వామ్యం కావాలని, పథకాన్ని వంద శాతం విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
కల్లు అమ్మకాల్లో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని అన్నారు. గీత కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. గతంలో నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయి, ఎన్ని చనిపోయాయి, వాటి స్థానంలో కొత్త మొక్కలు ఎన్ని నాటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చెట్లను సంరక్షించవచ్చన్న విషయాలపై అధికారులతో మంత్రి చర్చించారు.
ఇవీ చూడండి: "ప్రవేశాలలోపు రుసుములు ఖరారు చెయ్యండి"