తెలంగాణ

telangana

ETV Bharat / state

'శ్రీశైలంలోకి వెలిగొండ మట్టిని తరలించడం ఆపండి'

Complaint On Veligonda: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ఈఎన్‌సీ మురళీధర్‌రావు మరో లేఖ రాశారు. వెలిగొండ సొరంగం తవ్వకం మట్టిని శ్రీశైలంలోకి తరలించడంపై ఆయన ఫిర్యాదు చేశారు. మట్టిని శ్రీశైలం జలాశయంలోకి తరలించకుండా ఆపాలని లేఖలో కోరారు.

Complaint On Veligonda
ఈఎన్‌సీ మురళీధర్‌రావు లేఖ

By

Published : Jun 7, 2022, 4:51 PM IST

Complaint On Veligonda: ఏపీలో చేపడుతున్న వెలిగొండ ప్రాజెక్ట్ సొరంగం మట్టిని శ్రీశైలం జలాశయంలోకి తరలించకుండా ఆపాలని రాష్ట్ర ఈఎన్​సీ మురళీధర్​రావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేఆర్​ఎంబీకి ఛైర్మన్​కు ఆయన లేఖ రాశారు. వెలిగొండ టన్నెల్ తవ్వకం పనులకు సంబంధించిన మట్టి, వ్యర్థాలను గుత్తేదారు శ్రీశైలం జలాశయంలో కలుపుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలోనూ జరుగుతున్న పనుల వ్యర్థాలను కూడా శ్రీశైలం ప్రాజెక్టు కుడిగట్టు వైపు డంప్ చేస్తున్నారన్న తెలంగాణ... దీంతో పాటు చాలా రోజులుగా టన్నుల కొద్దీ వ్యర్థాలను నదిలో కలుపుతున్నారని ఫిర్యాదు చేశారు.

నదిలో పూడిక నిండడంతో ఇప్పటికే శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని లేఖలో వివరించారు. టన్నెల్ వ్యర్థాలను డంప్ చేస్తుండడంతో మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పేలుడు పదార్థాలు తదితర హానికర వ్యర్థాలను జలాశయంలో కలపడం వల్ల తాగు, సాగునీరు కలుషితమవుతోందని పేర్కొన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా, వ్యర్థాలను జలాశయంలోకి తరలించకుండా గుత్తేదారు, ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలని తెలంగాణ ఈఎన్​సీ మురళీధర్​రావు కోరారు. పరిస్థితిని అంచనా వేసేందుకు తక్షణమే ఆ ప్రాంతాన్ని సందర్శించి పూర్తి వివరాలు తెప్పించుకోవాలని కృష్ణా బోర్డుకు విజ్ఞప్తి చేసింది.

ABOUT THE AUTHOR

...view details