తెలంగాణలో 2020-21 వార్షిక బడ్జెట్ అన్ని వర్గాలకు పూర్తి సానుకూలంగా, వాస్తవికంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళి సైకు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ఆయన గవర్నర్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకు ఆమెను ఆహ్వానించారు. మంత్రిమండలి ఆమోదించిన గవర్నర్ ప్రసంగ ప్రతిని.. తమిళిసైకి అందించారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించారు. ప్రత్యేకించి కరోనా వైరస్ నియంత్రణా చర్యలు, ముందుజాగ్రత్త చర్యలను గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు.
బడ్జెట్‌కు ఆమోద ముద్ర:
బడ్జెట్ పద్దులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, అధికారులతో సీఎం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్యతా పథకాలకు నిధుల కేటాయింపు విషయాన్ని పరిశీలించారు. వ్యవసాయ శాఖ పద్దుపై విస్తృతంగా చర్చించారు. రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలకు కేటాయింపులతో పాటు రుణమాఫీ అమలు దిశగా చర్యలు, అందుకు సంబంధించి బడ్జెట్లో నిధులు పొందుపరచడం, తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారు.