కాయలు సహజసిద్ధంగా పండాలని... ఇందుకు విరుద్ధంగా రసాయనాలతో పండిస్తుండటంతో క్యాన్సర్ విపరీతంగా వస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రకృతితో ఆటలాడుకోవద్దని హితవు పలికింది. ఎథిఫాన్ వినియోగానికి సంబంధించి జారీ చేసిన ఎస్‌ఓపీ (ప్రామాణిక నిర్వహణ విధానం)తో పాటు, ఎథిఫాన్ వినియోగం హానికరమా కాదా అన్న అంశాలపై స్పష్టతనిస్తూ కౌంటరు దాఖలు చేయాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
కార్బైడ్ వినియోగం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందంటూ 2015 ఆగస్టు 10న ‘పండు ఆరోగ్యం పుండు...రసాయనం దీనిపేరు’’ శీర్షికతో ప్రచురితమైన కథనాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన విషయం విదితమే. దీంతోపాటు ఎథిఫాన్ డీలర్లు, వ్యాపారులపై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ గోల్డ్‌రైప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఎస్‌జీఎస్ ఇంటర్నేషనల్ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌లతో పాటు ఎస్‌ఓపీని సవాలు చేస్తూ దాఖలైన మరో ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.