తనపై కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) హైకోర్టును ఆశ్రయించారు. ఒకే తరహా ఆరోపణలపై ఒకటి తర్వాత మరొకటి కేసులు నమోదు చేస్తున్నారన్నారు. తనపై చిలకలగూడ, హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా దర్యాప్తు పేరుతో వేధిస్తున్నారన్నారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు పిలవకుండా... ఆన్లైన్లో జరిపేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్లో తీన్మార్ మల్లన్న కోరారు. పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరగనుంది.
చిలకలగూడ పీఎస్‌లో కేసు...
సికింద్రాబాద్ నార్త్‌జోన్ పరిధిలోని చిలకలగూడ ఠాణాలో గురువారం తీన్మార్ మల్లన్నను పోలీసులు విచారించారు. తనను తీన్మార్ మల్లన్న డబ్బులు డిమాండ్ చేసి బెదిరించాడంటూ సీతాఫల్‌మండి డివిజన్ మధురానగర్ కాలనీకి చెందిన మారుతీ జ్యోతిష్యాలయం నిర్వాహకులు లక్ష్మీకాంత్‌శర్మ ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో తీన్మార్ మల్లన్నను మహంకాళి ఏసీపీ రమేశ్, ఇన్‌స్పెక్టర్ నరేశ్‌లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు విచారించారు. ఈ నెల 8న మరోసారి రావాలని చెప్పారు.
ఉంగరాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వ్యవస్థపై మాట్లాడినందుకే తనపై కేసు పెట్టారని తీన్మార్ మల్లన్న తెలిపారు. బాధితుడు ఏప్రిల్‌లో ఫిర్యాదు చేసినప్పుడే తనను విచారించాల్సిందని, ఈ నెల 3న నోటీసులిచ్చి.. రెండు రోజుల్లోనే విచారణకు పిలవడం వెనక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
మల్లన్న కార్యాలయంలో సోదాలు
తీన్మార్ మల్లన్న కార్యాలయంలో మంగళవారం రాత్రి సైబర్ క్రైం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని కార్యాలయంలో సైబర్ క్రైం పోలీసులు అరగంట పాటు కంప్యూటర్లను తనిఖీ చేసి వెళ్లిపోయారు. హార్డ్ డిస్క్, పెన్‌డ్రైవ్, ఇతర కంప్యూటర్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీన్మార్ మల్లన్న వద్ద పనిచేసి మానేసిన ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. తీన్మార్ మల్లన్నతో పాటు అతని సోదరుడు పలువురి వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నట్లు యువతి ఆరోపణలు చేసింది. వ్యక్తిగత సమాచారంతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు సదరు యువతి ఫిర్యాదు చేసింది. హార్డ్ డిస్క్, పెన్‌డ్రైవ్‌లో పలువురి వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎవరి సమాచారం, ఎందుకు సేకరించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మల్లన్నకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని పోలీసులు వెల్లడించారు.
స్వల్ప ఉద్రిక్తత
తనిఖీల సమాచారం తెలుసుకున్న మల్లన్న అభిమానులు కార్యాలయం వద్దకు భారీగా చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సోదాల కోసం వచ్చిన వారిని అడ్డు కునే ప్రయత్నం చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు, అనుచరుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కొందరు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అనంతరం వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపైకి చేరి ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి:CM KCR REVIEW: నీటిపారుదలశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష