ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఆధారిత హాజరు నమోదుపై ఉపాధ్యాయులు సహాయ నిరాకరణ ప్రకటించారు. సొంత సెల్‌ఫోన్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, హాజరు నమోదు చేయబోమంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులకు లేఖలు సమర్పిస్తున్నారు. ప్రభుత్వం డివైజ్‌లు, డేటా ఇస్తేనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, వివరాలు నమోదు చేస్తామంటూ ప్రకటిస్తున్నారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా హాజరు నమోదు చేసినా సెలవు పెట్టాల్సిందేనని, దీన్నే జీతాలకు ప్రామాణికంగా తీసుకుంటామని విద్యాశాఖ ప్రకటించింది. ఉపాధ్యాయుల సెల్‌ఫోన్లలోనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్ గురించి పట్టించుకోకుండా హాజరు నమోదు తప్పదని వెల్లడించింది. దీన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. యాప్ ద్వారా ముఖ ఆధారిత హాజరు నమోదుపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, జేడీ రామలింగంతో ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నిర్వహించిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపాధ్యాయులు అమలు చేయాలని, హాజరు నమోదులో ఉన్న సమస్యలను సవరించడానికి ప్రయత్నిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ డివైజ్‌లు ఇచ్చే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టత వచ్చే వరకు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దంటూ ఫ్యాప్టో ప్రకటించింది.
మొదటిరోజే అవస్థలు..:రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల మంది వరకు ఉపాధ్యాయులు ఉన్నారు. అందరూ ఉదయం ఒకే సమయంలో ఈ-హాజరు నమోదు చేసేందుకు ప్రయత్నించగా లోడింగ్ ఫెయిల్.. మళ్లీ ప్రయత్నించాలంటూ మెసేజ్‌లు వచ్చాయి. కొన్నిచోట్ల సిగ్నల్స్ లేకపోవడంతో యాప్ ఓపెన్ కాలేదు. కొందరు మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రయత్నించారు. ఉదయం పాఠశాలకు వెళ్లినప్పటి నుంచి హాజరు నమోదు చేసేందుకు ఫోన్లతో కుస్తీలు పట్టాల్సి వచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా హాజరు వేయలేక చాలా మంది ఉపాధ్యాయులు విసిగిపోయారు. చాలా పాఠశాలలో మొదటి పీరియడ్ హాజరు నమోదుకే సరిపోయింది. ఆ మేరకు విద్యార్థులు అభ్యసన కోల్పోయారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని ఉపాధ్యాయ సంఘాలు ప్రచారం చేయడంతో కొందరు ఇప్పటికీ డౌన్‌లోడ్ చేసుకోలేదు. డౌన్‌లోడ్ చేసుకున్న వారిలోనూ చాలామంది హాజరు వేయలేదు. వ్యక్తిగత మొబైల్ ఫోన్‌లో యాప్‌తో హాజరు నమోదుకు తాము వ్యతిరేకమని రాష్ట్రోపాధ్యాయ, తెలుగునాడు ఉపాధ్యాయ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి.
పొన్నా భాస్కర ఫణికుమార్ అనే నేను కృష్ణా జిల్లా మల్లంపూడి ఎంపీయూపీఎస్ పాఠశాలలో ఎస్జీటీగా పని చేస్తున్నాను. నేను నా మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోదలిచాను. ఛార్జీలు పెరగడం వల్ల డేటా వినియోగాన్ని నిలిపివేస్తున్నాను. ఫోన్‌ను పాఠశాలకు తీసుకురావడం లేదు. ప్రభుత్వం ఇచ్చే ఏ యాప్‌లోనైనా పని చేయాల్సి వస్తే అందుకు తగిన డేటా, ఎలక్ట్రానిక్ డివైజ్‌లను అందిస్తే చేస్తాను.- ప్రధానోపాధ్యాయుడికి ఓ ఉపాధ్యాయుడి లేఖ