Teacher MLC elections: హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉపాధ్యాయ నియోజకవర్గం శాసనమండలి ఎన్నికలో బహుముఖ పోటీ నెలకొంది. ఇటు ఉపాధ్యాయ సంఘాలతో పాటు.. రాజకీయ పార్టీల్లోనూ వేడి పుట్టిస్తోంది. ఈనెల 16న ప్రారంభమైన నామినేషన్లు.. 23 వరకు కొనసాగనున్నాయి. గత 2017 ఎన్నికల్లో 14 మంది పోటీ చేయగా.. ఈసారి 20 మంది అభ్యర్థుల వరకు బరిలో ఉండొచ్చని అంచనా.
గత ఎన్నికల్లో భారాస మద్దతుతో PRTU-TS అభ్యర్థి కాటేపల్లి జనార్దన్‌రెడ్డి గెలిచారు. అయితే పీఆర్‌టీయూ టీఎస్ తమ అభ్యర్థిగా కాటేపల్లి జనార్దన్‌రెడ్డి బదులుగా చెన్నకేశవరెడ్డిని పోటీకి దించింది. దీంతో కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పీఆర్‌టీయూ తెలంగాణ సంఘం తరఫున పోటీకి దిగారు. మరోవైపు వామపక్ష పార్టీల అనుకూల సంఘాలు యూటీఎఫ్, ఎస్టీయూ కూడా రంగంలో ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎవరికీ మద్దతు ప్రకటించకుండా వ్యూహాత్మకంగా తటస్థంగా ఉండాలని భావిస్తోంది.
మరోవైపు బీజేపీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించింది. దిల్‌సుఖ్‌నగర్ పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ ఏవీఎన్ రెడ్డి భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగారు. భాజపా అనుకూల సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం.. తపస్ మద్దతు ఉంది. ఏవీఎన్ రెడ్డి గత ఎన్నికల్లో ఎస్‌టీయూ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో హర్షవర్దన్‌రెడ్డి నామినేషన్ వేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన హర్షవర్దన్ రెడ్డి గత టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ తెలంగాణ తరఫున పోటీ చేసి ఓడిపోయి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.