TDP Porubata: ఏపీలోని విశాఖపట్టణంలోని రుషికొండ పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. ఉత్తరాంధ్ర సమస్యలపై తెలుగుదేశం పోరుబాటలో భాగంగా.. రుషికొండకు ఆ పార్టీ నేతలు ర్యాలీ తలపెట్టారు. ఈ తరుణంలో రుషికొండ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఎవరూ రాకుండా.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రుషికొండ బీచ్ రోడ్‌లో ఎవరినీ అనుమతించడం లేదు. అదే సమయంలో.. విశాఖలోని తెదేపా కార్యాలయంతో పాటు ఆ పార్టీ నేతల ఇళ్ల వద్ద నిఘా పెంచారు.
నేతలు బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులతో ఆయా నేతల ఇళ్ల వద్ద పహారా కాస్తున్నారు. తెదేపా కార్యాలయం వద్ద 100 మందికిపైగా పోలీసులను మోహరించారు. కార్యాలయం ముందు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలపై ఆంక్షలు విధించారు. అవసరమైతే అరెస్టులకు 3 భారీ వాహనాలను సిద్ధం చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి, ఎమ్మెల్సీ రామారావు, తెదేపా నేత పల్లా శ్రీనివాస్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు తెదేపా కార్పొరేటర్లు గృహ నిర్బంధంలో ఉన్నారు. తెలుగుదేశం నాయకుడు బండారు అప్పలనాయుడును పోలీసులు స్టేషన్‌కు తరలించారు. మేనత్త ఆస్పత్రిలో ఉందని చెప్పినా వినకుండా తీసుకెళ్లారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు అనితాను పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖలోని ఎండాడ కూడలిలోనూ భారీగా పోలీసులను మోహరించారు. తగరపువలస జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులను కూడా అనుమతించడం లేదు. ఫలితంగా భీమిలి బీచ్ రోడ్ గ్రామాల నుంచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. భీమిలి నుంచి విశాఖకు వచ్చేవారిని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు.
చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తెదేపా నేతలు విశాఖ తరలిరాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. విజయనగరం జిల్లా రాజాంలో మాజీ మంత్రి కళా వెంకట్రావును గృహ నిర్బంధం చేశారు. ఉదయం 5గంటల నుంచే రాజాంలో అయన నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. కళా వెంకట్రావు ఇంటి వద్దకు చేరుకున్న తెదేపా నాయకులు.. పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో రుషికొండ కార్యక్రమానికి వెళ్లకుండా పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, పాచిపెంట మండలాల్లోని తెదేపా నేతలను పోలీసులు నిర్బంధించారు. ఈ విషయంపై తెదేపా పోలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి పోలీసులతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడానికి కారణం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
ఎంత అడ్డుకున్నా 'సేవ్ ఉత్తరాంధ్ర' నినాదం ఆగదు. రుషికొండ విధ్వంసం, దసపల్లా భూముల దోపిడీలు, ఆస్తుల ఆక్రమణ, గంజాయి సాగు - అమ్మకాలు, అక్రమ మైనింగ్‌పై వైకాపా దారుణాలను ప్రజల ముందు ఉంచి తీరుతాము. కొండలను సైతం మింగుతున్న వైకాపా అనకొండల బండారం బయట పెట్టేందుకే తమ నేతలు పోరుబాట చేపట్టారు. వైకాపా దోపిడీపై తెదేపా పోరుబాటను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మహిళ నేతలను సైతం నిర్బంధించడం పాలకుల అరాచకత్వానికి నిదర్శనం. ఉత్తరాంధ్రలో ప్రభుత్వ భూములు, ప్రజల ఆస్తులను దోచుకున్నందునే తెదేపా పోరుబాటపై ప్రభుత్వం భయపడుతుంది. - నారా చంద్రబాబు నాయుడు, తెదేపా అధినేత
ఉత్తరాంధ్రలో వైకాపా మార్క్ దోపిడీ..ఉత్తరాంధ్రలో వైకాపా మార్క్ దోపిడీ, అసలైన ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో కనీసం 10 పైసలు అభివృద్ది చేసినా తెదేపా నేతల ఇంటి ముందు కాపలా కాసే ఖర్మ, సినిమా హాల్ కి వెళ్లి ఒక మహిళా నేతను అరెస్ట్ చెయ్యాల్సిన దుస్థితి ప్యాలెస్ పిల్లికి వచ్చేది కాదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అండ్ కో ఉత్తరాంధ్రను అడ్డంగా దోచుకుంటున్న వ్యవహారాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే తెదేపా పోరుబాట కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర పోరుబాటకు బయలుదేరిన తెదేపా నేతలు బుద్దా వెంకన్న, గౌతు శిరీష, ఇతర నేతలను నిర్బంధించడాన్ని చూస్తే జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైనట్లు స్పష్టమవుతోందన్నారు. ఉత్తరాంధ్రలో జె-గ్యాంగ్ దోపిడీ బండారాన్ని బయటపెట్టేందుకు వస్తోన్న తెదేపా నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గళాలపై జగన్ రెడ్డి పోలీసులతో చేయిస్తున్న దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అండ్ కో ఉత్తరాంధ్రను అడ్డంగా దోచుకుంటున్న వ్యవహారాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే తెదేపా ఆధ్వర్యంలో తలపెట్టిన ఉత్తరాంధ్ర సమస్యలపై పోరుబాట కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర పోరుబాటకు బయలుదేరిన తెదేపా నేతలు బుద్దా వెంకన్న, గౌతు శిరీష, ఇతర నేతలను నిర్బంధించడాన్ని చూస్తే జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైనట్లు స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో జె-గ్యాంగ్ దోపిడీ బండారాన్ని బయటపెట్టేందుకు వస్తోన్న తెదేపా నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గళాలపై జగన్ రెడ్డి పోలీసులతో చేయిస్తున్న దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర సమస్యలపై పోరుబాటను విజయవంతం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
విశాఖలో వైకాపా దోపిడీ బయటపడుతుందనే భయంతోనే తమను విశాఖ వెళ్లనివ్వడం లేదని తెదేపా నేత బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా బెదిరింపులకు తాము భయపడమని స్పష్టంచేశారు. విశాఖ వెళ్లనీయకుండా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఆయన నిరాహారదీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు పార్టీ సీనియర్ నేతలు సంఘీభావం తెలిపారు. తనను విశాఖ వెళ్లనిచ్చే వరకూ దీక్ష కొనసాగిస్తానని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. విశాఖలో కొట్టేసిన భూముల కోసమే... మూడు రాజధానులు ఆట ఆడుతున్నారని తెదేపా నేతలు ఆక్షేపించారు.
ప్రజావేదిక కూల్చివేత విషయంలో పర్యావరణాన్ని దెబ్బతీసేలా నిర్మాణాలు చేపట్టడం దారుణమంటూ జగన్ నీతులు చెప్పారని... మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అదే నీతి రుషికొండ విషయంలో వర్తించదా అని నిలదీశారు. పచ్చని రుషికొండను బోడికొండగా మార్చడం పర్యావరణాన్ని దెబ్బతీయడం కాదా అని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: