ఆంధ్రప్రదేశ్ పరిస్థితి.. నిండుగా ఉన్న చేపల చెరువుకు కొంగల గుంపును కాపలా పెట్టినట్లయ్యిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. వేల కోట్ల రూపాయల అవినీతి చేసి జైలుకు పోయి వచ్చినవాళ్లకి అధికారం వస్తే... అవినీతికి హద్దు, అదుపు ఉండదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక కొరతపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. దోచుకో దాచుకో పేరిట ఓ వీడియోను ట్విటర్లో విడుదల చేశారు. జగన్ సీఎం అయిన వెంటనే ఇసుకపై పడి తెదేపా ఉచిత ఇసుక పాలసీని రద్దు చేసి.. రీచ్లన్నిటినీ వైకాపా ఇసుక మాఫియా పరం చేశారని ఆరోపించారు. ఏడాదిలోనే 13 లక్షల టన్నుల ఇసుక మాయం చేశారని దుయ్యబట్టారు.
భూ కుంభకోణాలే..!
రాష్ట్రంలో భూకబ్జాలకు అంతే లేదని చంద్రబాబు మండిపడ్డారు. బ్లీచింగ్ చల్లితే కరోనా పోతుందన్న జగన్.. ఒక్క జిల్లాలోనే బ్లీచింగ్ కొనుగోళ్లలో రూ.75 కోట్ల కుంభకోణం చేశారని.. ఇక మిగిలిన జిల్లాల్లో ఎంత చేశారో అని అనుమానం వ్యక్తం చేశారు. రూ.333 విలువ చేసే కరోనా కిట్‌ను రూ.770లకు కొనడం మరో కుంభకోణం అన్నారు. ఇళ్ల స్థలాల ముసుగులో భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వాటాలు ఇవ్వని పారిశ్రామిక వేత్తలను జె - టాక్స్‌తో వేధింపులకు గురిచేశారని.. మద్యం కంపెనీల నుంచి జె-టాక్స్ వసూళ్లు చేశారని మండిపడ్డారు.