‘‘తెలంగాణవాసుల మనోభావాలను గుర్తించి తెదేపా పని చేస్తుంది. మీరంతా కోరుకుంటున్నట్లు కొవిడ్ తర్వాత మాట్లాడుకొని పార్టీని పటిష్ఠం చేద్దాం. సమస్యలను పరిష్కరించుకుంటూ సాగుదాం. మీకు అందుబాటులో ఉంటా’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆ రాష్ట్ర నాయకులను ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మాణాత్మకంగా కృషి చేశామన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ మంత్రి లోకేశ్ తదితరులతో కలిసి చంద్రబాబు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ యుగ పురుషుడని శ్లాఘించారు. డిజిటల్ మహానాడులో రెండో రోజు శుక్రవారం వివిధ సందర్భాల్లోనూ ఆయన మాట్లాడారు. ‘‘మహిళా సాధికారత కోసం పని చేసిన పార్టీ తెదేపా. వారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించాం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మహిళా విశ్వవిద్యాలయం తెచ్చాం. నేనొచ్చాక డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చా. ఉద్యోగాల్లో, కళాశాల ప్రవేశాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం. ఐటీ కంపెనీల్లో ఎక్కువగా మహిళలు పని చేస్తున్నారంటే ఆ రోజున మనం చూపించిన చొరవ, వేసిన పునాదే కారణం’’ అని వివరించారు. ‘నేను రావాలని మీరందరూ కోరుతున్నారు. 15 రోజులకోసారి రమ్మంటున్నారు. కొవిడ్ తగ్గాక మాట్లాడదాం. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా. పార్టీ పుట్టింది హైదరాబాద్‌లోనే. ఈ విషయాలన్నీ ప్రజలందరికీ తెలుసు. తెలుగు వారి కోసం, తెలుగు జాతి కోసం పని చేసే పార్టీ మనది’ అని అన్నారు.
కరోనాతో ఎన్నో కుటుంబాలు దారిద్య్రరేఖ దిగువకు వెళ్లిపోయాయి. ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూ ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. లేదంటే ప్రజల తలసరి ఆదాయం తగ్గిపోయి మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. సంక్షోభాలు వచ్చినపుడు బయటపడటానికి అనువైన మార్గాన్ని ఎన్నుకొని దూరదృష్టితో పని చేయాలి.
- డిజిటల్ మహానాడులో చంద్రబాబు
భారతరత్న ఇచ్చేవరకూ పోరాటం
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేవరకూ తెదేపా పోరాడుతుందని చంద్రబాబు వెల్లడించారు. భారతరత్న ఇవ్వాలని మహానాడులో చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. ఆయన వ్యక్తి కాదు.. వ్యవస్థ, శక్తి అని కొనియాడారు. ‘‘ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే తలమానికం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 25 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు. రూ.2కే కిలో బియ్యం, పేదలకు ఇళ్ల నిర్మాణం, గురుకుల పాఠశాలలను ప్రవేశపెట్టారు’’ అని పేర్కొన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక- సామాజిక న్యాయప్రదాత ఎన్టీఆర్‌కు నివాళి అంటూ కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని సినీనటుడు బాలకృష్ణ, తెదేపా తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ తదితరులు బలపరిచారు. ఈ సందర్భంగా ‘స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగువారి ఆస్తి, వారసత్వం- భావితరాలకు స్ఫూర్తి- ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి’ అని తీర్మానించారు.
ఆశించినంతగా అభివృద్ధి చెందని హైదరాబాద్
విభజన తర్వాత హైదరాబాద్‌ను ఆశించినంతగా అభివృద్ధి చేయలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ‘‘తెదేపా హయాంలో గాంధీ ఆసుపత్రిని యుద్ధప్రాతిపదికన నిర్మించాం. నిమ్స్‌ను ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేశాం. వైద్య పర్యాటకాన్ని (హెల్త్ టూరిజం) అభివృద్ధి చేయడంతో హైదరాబాద్‌లో పెద్దఎత్తున ప్రైవేట్ ఆసుపత్రులొచ్చాయి’’ అని గుర్తుచేశారు. తెలంగాణలో మూతపడిన చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొరవడిన మహిళా వికాసం, ప్రజారోగ్యంపై కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం, తెలంగాణలో నిరుద్యోగ సమస్య- ఉపాధి అవకాశాలు- పరిశ్రమల మూసివేత- కుదేలైన విద్యారంగం తదితర అంశాలపై మహానాడులో చర్చించారు.