జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చతికిలపడింది. మొత్తం 150కి గాను 106 డివిజన్లలో అభ్యర్థులను రంగంలోకి దించినా ఎక్కడా కనీసం పోటీ ఇవ్వలేక ఫలితాల్లో కనుమరుగైంది. ప్రస్తుత ఎన్నికల్లో 90 శాతం టిక్కెట్లు బడుగు, బలహీనవర్గాలకే ఇచ్చినట్లు పార్టీ ప్రచారం చేసుకుంది. ఆటోడ్రైవర్ సతీమణికి ఓ డివిజన్‌లో, పాలు అమ్ముకునే సాధారణ వ్యక్తికి మరోచోట...ఇలా పార్టీ కోసం పనిచేసిన సామాన్య కార్యకర్తలకే ఎక్కువ టిక్కెట్లు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయినా చివరికి ఫలితాలు నిరాశపరిచాయని తెదేపా నేతలు వాపోతున్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా, తెరాస నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంచారని, తాము డబ్బును పంచకుండా నిజాయితీగా ప్రచారం చేశామని నగర ఎన్నికల కమిటీ కన్వీనర్ అరవిందకుమార్‌గౌడ్ చెప్పారు.
పార్టీ మారరన్న నమ్మకం లేకే..!
2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సైతం కేవలం కేపీహెచ్‌బీ డివిజన్‌లో మాత్రమే తెదేపా నెగ్గింది. గెలిచిన కొద్దిరోజులకే ఆ ఒక్క కార్పొరేటర్ అధికార తెరాస పార్టీలో చేరిపోవడం పార్టీ శ్రేణులను నిరాశపరిచింది. ప్రస్తుత ఎన్నికల్లో ఎక్కడైనా తెదేపాను గెలిపించినా కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు మళ్లీ అధికార తెరాసలో చేరరనే నమ్మకం ఏముంటుందని పార్టీ అభిమానులు ప్రచారం సందర్భంగా ప్రశ్నించారని ఓ ముఖ్యనేత వివరించారు. పార్టీపై అభిమానమున్నా గెలిచినవారు అధికార పార్టీలోకి వెళ్లడం వల్ల వారు కూడా ఓట్లు వేయడానికి ఆసక్తి చూపలేదని ఆయన విశ్లేషించారు. తెదేపా ఎటూ గెలవలేదని, కొందరు భాజపా వైపు మొగ్గుచూపారని ఆయన తెలిపారు.