Nara Lokesh Comments Jagan: సీబీఐ నుంచి అవినాష్‌రెడ్డిని కాపాడేందుకే ఏపీ సీఎం జగన్ దిల్లీకి వెళ్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. జగన్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావటానికి దిల్లీ వెళ్లటం లేదని దుయ్యబట్టారు. యువగళం పాదయాత్ర నాలుగో రోజులో భాగంగా ఏపీలోని పలమనేరు నియోజకవర్గంలో కొనసాగింది. నియోజకవర్గంలోని గాంధారమాకులపల్లెలో ఏర్పాటు చేసిన వడ్డెర సంఘం సమావేశం, తెలుగు యువత ఏర్పాటు చేసిన 'హలో లోకేశ్' కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
గడిచిన మూడు సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను యువత లోకేశ్‌కు వివరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు కావటంతో కళాశాలలు వేలకు వేల ఫీజులు వసూలు చేస్తున్నాయని వాపోయారు. చదువుకున్నా ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నామని.. భవిష్యత్‌కు మార్గం చూపెట్టాలని లోకేశ్‌ను కోరారు. దీనిపై స్పందించిన లోకేశ్ అధికారంలోకి రాగానే ప్రతియేటా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు.
చంద్రబాబు హయాంలో కంపెనీలను తీసుకువచ్చి సూమారు 5లక్షల ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని రివర్స్ గేర్ వేసి.. వెనక్కి తీసుకెళ్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తే యువతపై కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నారన్నారు. యువత పోరాటానికి మద్దతుగా నిలబడేందుకే యువగళం కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు.