తెలంగాణ

telangana

ETV Bharat / state

నేతల నిర్బంధం... యాత్రకు అవరోధం... - చిత్తూరు తాజా వార్తలు

ఏపీలో హంద్రీ- నీవా జలసాధన కోసం తెదేపా చేపట్టిన మహాపాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. పాదయాత్రకు వెళ్లకుండా తెదేపా నేతలు, పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను గృహనిర్బంధం చేశారు. నేతలను అడ్డుకున్నా తెదేపా తలపెట్టిన మహాపాదయాత్రను కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో తెదేపా కార్యకర్తలు కొనసాగించారు. పాదయాత్ర కొనసాగించాలని... యాత్ర ఉద్దేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం పనులను పూర్తిచేయాలని డిమాండ్‌ చేస్తూ... తెదేపా చిత్తూరు జిల్లా నేతలు చేపట్టిన మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం, నేతల గృహనిర్బంధాలు తదితర అంశాలపై తెదేపా శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

kuppam latest news
నేతల నిర్బంధం... యాత్రకు అవరోధం...

By

Published : Oct 27, 2020, 11:01 AM IST

ఆంధ్రప్రదేశ్​లో తెదేపా హయాంలో చేపట్టిన హంద్రీ- నీవా కుప్పం బ్రాంచి కాలువ తవ్వకం పెండింగ్‌ పనులను ప్రభుత్వం పట్టించుకోవాలన్న డిమాండ్​తో తెదేపా ఆధ్వర్యంలో జలసాధన పాదయాత్రను సోమవారం ఉదయం రామకుప్పం మండలంలోని వర్ధికుప్పం వద్ద ప్రారంభించి.. ఐదు రోజుల పాటు కొనసాగించాలని నేతలు నిర్ణయించారు. దీన్ని గుర్తించిన అధికార పార్టీ నాయకులు.. తెదేపా పాదయాత్రను అడ్డుకుంటామని ప్రకటించారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి రానుందని గ్రహించిన పోలీసులు రహస్య అజెండాను అమలు చేశారు.

సోమవారం ఉదయాన్నే కుప్పం, శాంతిపురం, రామకుప్పం, గుడుపల్లె మండలాల్లో పెద్ద ఎత్తున పోలీస్‌ అధికారులు, సిబ్బంది మోహరించారు. పలమనేరులో మాజీ మంత్రి అమరనాథరెడ్డి, చిత్తూరులో తెదేపా పార్లమెంట్‌ ఇంఛార్జి పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు, పుంగనూరులో నియోజకవర్గ ఇన్‌ఛార్జి అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డిని గృహ నిర్బంధం చేశారు. కుప్పం నియోజకవర్గంలో ముఖ్య నేతలతో పాటు మండల స్థాయి నాయకులను గృహాలకే పరిమితం చేశారు. శాంతిపురం మండలంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, తెదేపా మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనార్దన్‌రెడ్డి, ఆర్‌.ఎస్‌.మణి, మాజీ వైస్‌ ఎంపీపీ ఉదయ్‌కుమార్‌, రెస్కో మాజీ వైస్‌ ఛైర్మన్‌ చలపతి, రామకుప్పంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆంజినేయరెడ్డి, మండల ఇన్‌ఛార్జి మునస్వామి, పట్రనారాయణ, చలపతి, ఆనందరెడ్డి తదితర నేతలను హౌస్‌ అరెస్టు చేశారు. కుప్పంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మునిరత్నం, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజ్‌కుమార్‌, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ సత్యేంద్రశేఖర్‌ తదితరులను గృహ నిర్బంధం చేశారు. నాయకులను పోలీసులు అడ్డుకోవడాన్ని తెలుసుకున్న తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున వారి ఇళ్ల వద్దకు చేరుకొని సంఘీభావం తెలిపారు.

హంద్రీ- నీవా కాలువలో తెదేపా శ్రేణుల పాదయాత్ర

రామకుప్పం మండలంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు మెరుపు పాదయాత్రను చేపట్టారు. ముఖ్య నేతలను పోలీసులు అడ్డుకోగా.. పలు చోట్ల ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు జెండాలను చేతపట్టి కాలువ.. గట్టుపై పాదయాత్రను కొనసాగించారు. శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు వద్ద కాలువలో తెదేపా శ్రేణులు పాదయాత్రను చేపట్టి.. చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు.

వైకాపా ర్యాలీలు

వైకాపా నాయకులు, కార్యకర్తలు ర్యాలీలను నిర్వహించారు. తెదేపా పాలనలో హంద్రీ- నీవా కాలువను పూర్తి చేయకపోవడంతో పాటు వైకాపా ప్రభుత్వం పేదలకు ఇవ్వనున్న ఇళ్ల స్థలాలపై న్యాయస్థానం ద్వారా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మోటారు సైకిళ్లపై ర్యాలీ తీశారు. ర్యాలీలో పాల్గొనకుండా వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి భరత్​తో పాటు పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కుప్పం అర్బన్‌, గ్రామీణ, వి.కోట, పుంగనూరు, పలమనేరు, గంగవరం సర్కిళ్ల పరిధి నుంచి సీఐలు, ఎస్సైలు, పోలీసులు కుప్పం నియోజకవర్గంలో మోహరించి.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించారు.

నీళ్లివ్వమని కోరడం తప్పా.?

హంద్రీ-నీవా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు పూర్తి చేసి నీళ్లివ్వాలని ప్రజాస్వామ్యబద్దంగా కోరడం తప్పా అని మాజీ మంత్రి అమరనాథ్​రెడ్డి ప్రశ్నించారు. అన్‌లాక్‌- 5 నిబంధనలకు లోబడే తాము పాదయాత్ర చేపట్టనున్నామన్నారు. కుప్పం నియోజకవర్గంలో 123 కి.మీ దూరం కెనాల్‌ ఉండగా.. 121 కి.మీ దూరం గత ప్రభుత్వంలోనే పనులు పూర్తయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు బలరామ్‌కుట్టి, గిరిబాబు, సుబ్రహ్మణ్యంగౌడు పాల్గొన్నారు.

ఇవీచూడండి:దుబ్బాకలో వేడెక్కిన రాజకీయం... రణరంగంగా సిద్దిపేట

ABOUT THE AUTHOR

...view details