ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కోరామని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. బాబు నేతృత్వంలోని ఏడుగురు తెదేపా నేతల బృందం.. ఇవాళ రాష్ట్రపతిని కలిసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించటంతో పాటు.. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పేట్రేగుతోందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతిని కోరామన్నారు. తెదేపా నేతల విజ్ఞప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించినట్లు నేతలు తెలిపారు.
ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై రాష్ట్రపతికి వివరించాం. ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఏపీ చిరునామాగా మారింది. ఏజెన్సీలో 25 వేల ఎకరాల్లో గంజాయి పెంచుతున్నారు. సాగుచేస్తున్న గంజాయి విలువ రూ.8 వేల కోట్లు ఉంటుంది. ముంద్రా పోర్టులో 3 వేల కిలోల హెరాయిన్ పట్టుకున్నారు. హెరాయిన్ చిరునామా విజయవాడ సత్యనారాయణపురంగా తేలింది. మద్యపాన నిషేధమని చెప్పి ధరలు పెంచి సొంత వ్యాపారం చేస్తున్నారు. రాష్ట్రంలో మద్యం ప్రత్యేక బ్రాండ్లను జగన్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక బ్రాండ్లు సరఫరా చేస్తున్నారు. మాదకద్రవ్యాల వల్ల యువత నిర్వీర్యమైపోయే పరిస్థితి ఎర్పడింది. మాదకద్రవ్యాలను అదుపుచేయాలని ప్రభుత్వాన్ని కోరాం. ఒకేసారి తెదేపా కార్యాలయాలపై దాడులు చేశారు. రాష్ట్రంలోని తెదేపా నాయకుల ఇళ్లపై దాడులు చేశారు. పోలీసులే దాడులు చేయించి నిందితులను పంపించారు. దాడుల ఘటనలు ప్రభుత్వ ఉగ్రవాదం తప్ప మరోటి కాదు. రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి చరిత్రలో తొలిసారి. రాజకీయ నాయకులను భయపెట్టాలనేది వారి ఆలోచన.