TDP leaders on Ayyanna pathrudu arrest: జగన్ రెడ్డి ఒక సీఎంలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గోడలు దూకి, తలుపులు పగులగొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని, ఆయన కుమారుడిని అరెస్టు చేయడం తనకు దిగ్భ్రాంతిని కలిగించిదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వెంటాడుతోందని.. ఇప్పటికే 10కి పైగా కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. నాడు ఇంటి నిర్మాణాలు కూల్చివేత మొదలు.. అయ్యన్న కుటుంబ సభ్యులపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారని దుయ్యబట్టారు.
చింతకాయల విజయ్‌పై కేసు విషయంలో సీఐడీ విధానాలను కోర్టు తప్పు పట్టినా.. పోలీసుల తీరు మారలేదని విమర్శించారు. పోలీసులు దొంగల్లా ఇళ్ల మీద పడి అరెస్టులు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. వైకాపా సాగిస్తున్న ఉత్తరాంధ్ర దోపిడీపై బీసీ నేతల గళాన్ని అణిచివేసేందుకే అయ్యన్న అరెస్టు అని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ దోపిడీపై అయ్యన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కేసులు, అరెస్టులు సాగిస్తున్నారని ఆక్షేపించారు. అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుడు, రాజేశ్‌లను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
పరామర్శ..: అయ్యన్నపాత్రుడి భార్య పద్మావతిని చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. పార్టీ అన్ని విధాలా అదుకుంటుందని భరోసా ఇచ్చారు. అక్రమ అరెస్టుకు సంబంధించి న్యాయపరంగా పోరాడుతామని హమీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అయ్యన్నపాత్రుడి అరెస్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర పులిని చూసి.. ప్యాలెస్ పిల్లి భయపడింది..: ఉత్తరాంధ్ర పులి అయ్యన్నపాత్రుడుని చూసి.. ప్యాలెస్ పిల్లి భయపడిందంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో వైకాపా నాయకుల దోపిడీ, భూ కబ్జాలు, దౌర్జన్యాలను బయటపెడుతున్నందుకే బీసీ నేత అయ్యన్నపాత్రుడుని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. అర్ధరాత్రి పోలీసులు దొంగల్లా చొరబడి.. గోడ కేసులో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్‌ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే అయ్యన్నను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అయ్యన్న కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు: ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న అయ్యన్నపాత్రుడి కుటుంబంపై జగన్‌రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇది బీసీలపై జరిగిన దాడి అన్న ఆయన.. జగన్ హింసా విధానంపై ప్రజల పక్షాన ప్రశ్నించడం నేరంగా తెదేపా నాయకులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాడటం ఘోరంగా.. ప్రజల హక్కులు పరిరక్షణకు పూనుకోవడం ద్రోహంగా భావించి అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ మార్క్ దురాగతాలు, దురన్యాయాలు పాసిష్టు పాలనకు నిదర్శనమని విమర్శించారు.
నాశనం చేయడమే సీఎం లక్ష్యం:అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని తెదేపా నేత యనమల ధ్వజమెత్తారు. మున్సిపల్ శాఖకు చెందిన సివిల్ అంశంలో సీఐడీ జోక్యమేంటని ప్రశ్నించారు. కోర్టులో పరిష్కరించుకునే అంశాలపై పోలీసులు ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు. వైఎస్సార్ బంజారాహిల్స్‌లో చేసిన ఆక్రమణలను కోర్టు ద్వారా పరిష్కరించుకోలేదా? అని అడిగారు. ఫోర్జరీ ధ్రువపత్రాలను సీఐడీ దేని ఆధారంగా నిర్ధరణకు వచ్చిందని ప్రశ్నించారు. ఇది పూర్తిగా సివిల్ అంశం అని.. ఏమన్నా ఉంటే కోర్టులో తేల్చుకోవాలన్నారు. బీసీ నేతను నాశనం చేయడమే సీఎం లక్ష్యమని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.