ఏపీలో మూడు రాజధానుల (Three Capitals Repeal Act చట్టం ఉపసంహరించి.. మెరుగైన బిల్లు తెస్తామని చెప్పడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని తెదేపా నేతలు మండిపడ్డారు. రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురవుతుందని తెలిసే.. జగన్ కుట్ర రాజకీయాలు చేశారన్నారు. న్యాయం గెలుస్తుందనే భయంతోనే బిల్లు ఉపసంహరణకు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మండి పడ్డారు. 180కి పైగా ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు తప్పుపట్టాయని గుర్తు చేసిన కనకమేడల.. అమరావతి రాజధానిని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు.
మరో నాటకానికి తెర..
వికేంద్రీకరణ బిల్లును పూర్తి స్థాయిలో రద్దు చేయాలని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ నేత కూన రవికుమార్‌తో కలిసి శ్రీకాకుళంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. వైకాపా సర్కార్ మదిలో ఏదైనా కుట్ర ఉందా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రజలను గందరగోళంలోకి నెట్టకుండా రాజధానిపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిపై తెదేపా మొదటి నుంచి గట్టిగా పోరాడుతోందన్న రామ్మోహన్.. రైతుల పాదయాత్రకు వస్తున్న మద్దతు చూసి ప్రభుత్వం ఆలోచనలో పడిందన్నారు. రాజధాని అంశంపై జగన్ మరో నాటకానికి తెరలేపుతున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించే వరకూ తెదేపా పోరాడుతుందన్నారు.
మరింత గందరగోళం..
మూడు రాజధానుల (Three Capitals for AP) రద్దు నిర్ణయం.. తర్వాత సీఎం జగన్ ప్రకటన.. మరింత గందరగోళం సృష్టించాయని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. మళ్ళీ మెరుగైన బిల్లు అంటూ సీఎం చేసిన ప్రకటనతో మరింత అనిశ్చితి నెలకొందన్నారు. అమరావతి వ్యాజ్యాలపై న్యాయస్థానంలో వాదనలు కొలిక్కి వస్తున్నాయన్న పయ్యావుల.. తీర్పు వచ్చే సమయం దగ్గర పడిందని అన్ని లెక్కలూ వేసుకునే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. గతంలో చేసిన చట్టాలు తప్పు అని సీఎం జగన్ అంగీకరించిన విషయం స్పష్టమైందన్నారు.