Ayyanna Patrudu arrest : తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అరెస్టు
06:13 November 03
నర్సీపట్నంలో తెదేపా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అరెస్టు
Ayyanna Patrudu arrest : తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నంలో ఇవాళ తెల్లవారుజామున భారీ ఎత్తున పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. అనంతరం నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. ఆయన కుమారుడు చింతకాయల రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇంటిగోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగం ఉంది. సీఐడీ పోలీసులు అయ్యన్నపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఏలూరు కోర్టులో అయ్యన్నను హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు.
అయ్యన్నపాత్రుడిపై సీఐడీ పలు నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసింది. అయ్యన్న ఇంటి గోడలు దూకి లోనికి పోలీసులు లోనికి ప్రవేశించారు. అర్ధరాత్రి అయ్యన్నఇంట్లోకి పోలీసుల ప్రవేశంపై స్థానికులు ప్రతిఘటించారు. అయినా అయ్యన్న ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అయ్యన్న, అతడి కుమారుడు రాజేశ్‌ను అరెస్టు చేశారు.
తన భర్త, కుమారుడికి ప్రాణహాని ఉందని అయ్యన్న భార్య పద్మావతి అన్నారు. వారికేమైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. కనీసం దుస్తులు మార్చుకొనివ్వకుండా తన భర్తను తోసుకుంటూ తీసుకువెళ్లారని మండిపడ్డారు. కాళ్లకు చెప్పులు కూడా వేసుకొనివ్వకుండా లాక్కెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 ఏళ్లుగా తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందారు. మరోవైపు అయ్యన్న అరెస్టును మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఖండించారు.