TDP Contest 119 Seats In Telangana Assembly Elections : రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనున్నట్లు తెలంగాణ తెలుగుదేశం పార్టీ(TDP) రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మరోసారి తెలిపారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన మేడ్చల్ పార్లమెంటరీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం.. నూతన అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని.. ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా గుర్తింపు ఉన్న మల్కాజ్‌గిరిలో రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీ దిశగా ముందుకు సాగాలని కార్యకర్తలకు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తామని భయపడి టీఆర్ఎస్ నాయకులు తరచు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది అని ప్రచారాలు చేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారన్నారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేసే తెలుగుదేశం పార్టీ నాయకులు అంతట ఉన్నారని వారిని మేల్కొలిపి ఓటు వేసేందుకు నడిపించాలని కార్యకర్తలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ లేదని అన్న పార్టీలకు ఈ ఎన్నికలే గుణపాఠం కావాలని కాసాని జ్ఞానేశ్వర్ సూచించారు.
40 శాతం టికెట్లు యువతకే.. టీడీపీ పొలిట్‌బ్యూరోలో నిర్ణయం
"మల్కాజ్‌గిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వందనాలు. టీడీపీ బస్సు యాత్ర కంటే ముందు మల్కాజ్‌గిరి పార్లమెంటు పరిధిలో సభ ఏర్పాటు చేస్తాం. ప్రధానంగా రాబోయే ఎన్నికలో కూడా 119 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేయబోతుంది. గతంలో కూడా నేను చెప్పాను బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ వాళ్ల సీట్లను ప్రకటిస్తాయని అన్నారు. తామే గెలుస్తామని వాళ్లలోనే వాళ్లే పాచికలు వేసుకుంటున్నారు. తెలుగుదేశం క్లియర్‌గా ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి 39 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నువ్వానేనా అన్నట్లు ఉన్నారు."- కాసాని జ్ఞానేశ్వర్