భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం దుర్మార్గమైన చర్యని తెదేపా అధినేత చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక.. 80కి పైగా ఆలయాలమీద దాడులు జరిగాయని ఆరోపించారు. ఇంద్రకీలాద్రిపై.. అమ్మవారి రథానికి చెందిన సింహపు ప్రతిమలు మాయమైన నేపథ్యంలో.. చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఇన్ని ఘటనలు జరుగుతుంటే.. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దుర్గమ్మ ఆలయ ఘటనపై ఇంతవరకూ కేసు నమోదు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. దేవాదాయ శాఖ మంత్రిని, ఆలయ ఈవోను బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
దేవాలయాలపై దాడులు నిత్య కృత్యంగా ఉన్నా.. ప్రభుత్వంలో మార్పు లేదని ఆగ్రహించారు. ఎవరు మాట్లాడినా.. ఎదురు దాడి చేసే పరిస్థితి ఉందన్నారు. గతంలో.. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన అబ్దుల్ కలాం, సోనియాగాంధీ వంటి పెద్దలు.. ఆలయ డిక్లరేషన్‌లో సంతకం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. కానీ... శ్రీవారి దర్శనానికి వచ్చిన జగన్.. ఏనాడూ డిక్లరేషన్‌లో సంతకం చేయలేదని అన్నారు. మత సామరస్యం కాపాడడం ప్రభుత్వం బాధ్యత కాదా.. అని ప్రశ్నించారు. 80 ఘటనలు జరిగితే సీఎంగా పరిపాలించటానికి అర్హత ఉందా? అని నిలదీశారు. ఆలయాలపై దాడులు చేసినవారు రేపు మసీదులపై చేయరనే నమ్మకమేంటని చంద్రబాబు.. ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.