Telangana Half Financial Year tax In Last 6 Months Various Sectors :ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో రాష్ట్ర ఖజానాకు వచ్చిన రెవెన్యూ రాబడులు రూ.87,207 కోట్లు. బడ్జెట్ అంచనా రూ.2,16,566 కోట్లలో ఇది 40 శాతానికి పైగా ఉంది. పన్ను ఆదాయం అంచనా 1,52,499 కోట్ల రూపాయలు కాగా ఆరు నెలల్లో అందులో దాదాపు 44 శాతం మేర రూ.66,691 కోట్లు సమకూరాయి. జీఎస్టీ ద్వారా రూ.22,643 కోట్లు, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.7006 కోట్లు వచ్చాయి. అమ్మకం పన్ను ద్వారా రూ. 14,910 కోట్లు, ఎక్సైజ్ పన్నుల ద్వారా రూ.12,255 కోట్లు సమకూరాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.6102 కోట్లు రాగా.. ఇతర పన్నుల రూపంలో మరో రూ.3773 కోట్లు ఖజానాకు చేరాయి. ఎక్సైజ్ పన్నుల అంచనా రూ.19,884 కోట్లు కాగా.. అందులో సెప్టెంబర్ వరకు దాదాపు 62 శాతం రాష్ట ఖజానా కు సమకూరింది.
స్టాంపులు - రిజిస్ట్రేషన్లఆదాయం అంచనాల్లో 40 శాతం లోపు రాగా.. జీఎస్టీ 45 శాతం వరకు వచ్చింది. పన్నుయేతర ఆదాయం బాగానే సమకూరింది. బడ్జెట్ లో 22,808 కోట్ల రూపాయల పన్నుయేతర ఆదాయాన్ని అంచనా వేయగా.. సెప్టెంబర్ నెలాఖరు వరకు అందులో 74 శాతం మేర 16,896 కోట్ల రూపాయలు సమకూరాయి. కేంద్రం నుంచి వస్తాయని అంచనా వేసిన గ్రాంట్లు మాత్రం తక్కువే వచ్చాయి. గ్రాంట్ల రూపంలో 41,259 కోట్ల రూపాయలు వస్తాయని బడ్జెట్ లో అంచనా వేయగా.. ఆర్నెళ్లలో కేవలం రూ.3619 కోట్లు మాత్రమే వచ్చాయి. అంచనాల్లో ఈ మొత్తం తొమ్మిది శాతం కన్నా తక్కువ.
Telangana Half Financial Year Tax Collection: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 38,234 కోట్ల రూపాయల అప్పు ప్రతిపాదించగా.. అందులో ఇప్పటి వరకే రూ.31,333 కోట్లు తీసుకున్నారు. ఇది బడ్జెట్ అంచనాల్లో దాదాపు 82 శాతం. అన్ని రకాలుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖజానాకు 1,18,558 కోట్ల రూపాయలు సమకూరాయి. ఇది బడ్జెట్ అంచనా అయిన రూ.2,59,861 కోట్లలో దాదాపు 46 శాతంగా ఉంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చేసిన మొత్తం వ్యయం 1,14,151 కోట్ల రూపాయలు. ఇది బడ్జెట్ లో పేర్కొన్న రూ.2,49,209 కోట్లలో దాదాపు 46 శాతం. చేసిన ఖర్చులో రెవెన్యూ వ్యయం 47,227 కోట్లు కాగా.. మూలధన వ్యయం 22,836 కోట్ల రూపాయలు.