తెలంగాణ

telangana

Aishwarya Funeral at Hyderabad : ఆశ్రునయనాల మధ్య ముగిసిన ఐశ్వర్య అంత్యక్రియలు

By

Published : May 11, 2023, 1:55 PM IST

Updated : May 11, 2023, 2:24 PM IST

Aishwarya Funeral at Hyderabad : అమెరికాలోని టెక్సాస్​లో జరిగిన కాల్పుల్లో మరణించిన తాటికొండ ఐశ్వర్య అంతక్రియలు హైదరాబాద్​లో ముగిశాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు ఐశ్వర్య భౌతికకాయానికి... మంత్రి జగదీశ్వర్ రెడ్డి, హుజూర్​నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నివాళులర్పించారు.

Aishwarya
Aishwarya

Aishwarya Funeral at Hyderabad : నాలుగు రోజులక్రితం అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో మరణించిన తాటికొండ ఐశ్వర్య మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. రాత్రి తొమ్మిది గంటలకు ఆమె పార్థివదేహం హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లోని జడ్జి నివాసానికి చేరుకుంది. ఐశ్వర్య మృతదేహన్ని చూసి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు శోక సంద్రంలో మునిగారు. కాల్పులకు ముందే తల్లిదండ్రులతో మాట్లాడిన ఐశ్వర్య ఇలా విగతజీవిగా తిరిగి రావడాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన ఘటన అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది. ఇవాళ ఉదయం ఐశ్వర్య భౌతికకాయానికి... మంత్రి జగదీశ్వర్ రెడ్డి, హుజూర్​నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నివాళులర్పించారు. అనంతరం నాగోల్​లోని ఫత్తుల్ల గూడ శ్మశాన వాటికలో ఐశ్వర్య అంత్యక్రియలు నిర్వహించారు.

ఐశ్వర్య భౌతిక కాయం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి జగదీశ్వర్​రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి

అసలేం జరిగిందంటే:అమెరికాలోనిటెక్సాస్‌ రాష్ట్రం డాలస్‌ పట్టణానికి ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలోగల అలెన్‌ ప్రీమియర్‌ దుకాణ సముదాయంలో శనివారం ఓ దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో మొత్తం 8 మంది మరణించగా.. అందులో సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన తాటికొండ ఐశ్వర్య(27) కూడా ఉన్నట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. ఐశ్వర్య షాపింగ్‌ చేస్తున్న సమయంలో దుండగుడు తూటాల వర్షం కురిపించాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మృతిచెందిన ఆమెను వేలిముద్రల ఆధారంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సోమవారం సమాచారం అందించారు. ఐశ్వర్య రంగారెడ్డి జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి నర్సిరెడ్డి కుమార్తె. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వీరి స్వస్థలం కాగా.. సరూర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.

హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చదివిన ఐశ్వర్య ఆ తర్వాత 2020లో మిషిగన్‌ వర్సిటీలో కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో పీజీ పూర్తి చేశారు. అనంతరం పర్ఫెక్ట్‌ జనరల్‌ కాంట్రాక్టర్స్‌ సంస్థలో సివిల్‌ ఇంజినీర్‌గా చేరిన ఆమె.. ఇటీవల ప్రాజెక్టు మేనేజర్‌గా పదోన్నతి పొందారు. తన ఇద్దరు పిల్లల్లో గతేడాదే కుమారుడి పెళ్లి చేసిన నర్సిరెడ్డి, అరుణ దంపతులు.. కుమార్తె పెళ్లి చేయాలని భావిస్తున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. కాల్పులకు కొద్దిసేపు ముందే తల్లితో ఐశ్వర్య మాట్లాడిందని కుటుంబసభ్యులు వాపోయారు. ఐశ్వర్య మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు విచారం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : May 11, 2023, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details