Tarun Chugh comments on Bandisanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి వచ్చే నెల 11వ తేదీతో బండి సంజయ్ మూడేళ్ల పదవి కాలం ముగుస్తున్న తరుణంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు 2024లో జరుగుతాయని పేర్కొన్న ఆయన.. అంత వరకు అధ్యక్షుడిగా బండిసంజయ్‌ను కొనసాగించాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిపారు. అధికారిక ప్రకటన మార్చి మొదటి వారంలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అధికారం చేపట్టిన బండి సంజయ్ కుమార్ మొదటి నుంచి ఆపార్టీ బలోపేతానికి తన వంతు ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహాసంగ్రామ పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను గుర్తించారు. ఎక్కడిక్కడ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేసేవారు. జాతీయ నాయకులను సభలకు ఆహ్వానించి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సహం నింపేవారు. బడుగుబలహీన వర్గాల సమస్యలను గుర్తించి బీజేపీ తరుపున ఆ సమస్యలపై పోరాటం చేసేవారు.
హుజూరాబాద్, దుబ్బాక ఉపఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ఎంతో పాటుపడ్డారు. మునుగోడు ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి కోమాటిరెడ్డి రాజాగోపాల్‌రెడ్డి తరపున ప్రచారం కోసం ఎంతో శ్రమించారు. చివరకు ఆ ఎన్నికలో పార్టీ ఓటమిపాలైనా ఏమాత్రం నిరాశ చెందకుండా కార్యకర్తలకు ధైర్యం నింపారు. చివరకు ప్రధాని మోదీ సైతం బండిసంజయ్‌పై ఓ సందార్భంలో ప్రశంసల జల్లు కురిపించారు. సంజయ్ కష్టపడే నాయకుడని.. తెలంగాణలో బీజేపీ గెలవడానికి తన వంతు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇప్పుడు తరుణ్ చుగ్ ప్రకటనతో ఈ ఏడాది జరిగే అసెంబ్లీలో ఎన్నికల్లో బండి సంజయ్ సారథ్యంలోనే బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టమైంది.