Hyderabad Tourism Development : హుస్సేన్‌సాగర్ ప్రాంతం నగరంలో టూరిజానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. నగర నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్‌ను చూసేందుకు వచ్చే విదేశీయుల సంఖ్య కూడా పెరుగుతోంది. హైదరాబాద్‌కు వచ్చిన ఎక్కువ మంది హుస్సేన్‌సాగర్‌ను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశంలోనే ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, సచివాలయం నిర్మాణం ఈ ప్రాంతానికి మరింత శోభ తెచ్చింది. మున్ముందు పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అందుకు తగ్గట్లుగా రోడ్లు, ఫుట్‌పాత్‌లు, లైటింగ్ ఇతర సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన పనులు ఊపందుకున్నాయి. ఈ పనులన్నీ పూర్తయితే సాగరతీరం మరింత కొత్తగా కనిపిస్తుంది.
ట్యాంక్‌బండ్‌ను ఇటీవల రూ.60 కోట్లతో సుందరీకరించారు. భవిష్యత్తులో కేబుళ్లు, మురుగు నీటి వ్యవస్థ కోసం ఫుట్‌పాత్‌లు ధ్వంసం చేయకుండా భూగర్భంలో ప్రత్యేకంగా పీవీసీ పైపులు వేస్తున్నారు. వీధి దీపాల కోసం డివైడర్ల మధ్యలో నూతన సాంకేతికతతో కూడిన అలంకరణ స్తంభాలను వినియోగిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లో అభివృద్ధి పనులకు రూ.23 కోట్లు వెచ్చిస్తున్నారు. నెక్లెస్‌రోడ్డులో రూ.26 కోట్లతో కొత్త సాంకేతికతతో కూడిన వ్యాక్యూమ్ డీవాటర్డ్ సిమెంట్ కాంక్రీట్‌తో రహదారుల నిర్మాణ పనులు సాగుతున్నాయి.
హుస్సేన్‌సాగర్‌లోని కలుషిత జలాల నుంచి దుర్వాసన రాకుండా బయో రెమిడేషన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం రూ.2 కోట్లకు పైగా ఖర్చవుతుందని హెచ్ఎండీఏ అంచనా వేసింది. హుస్సేన్‌సాగర్, నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌తో పాటు పరిసర ప్రాంతాలు నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక హౌస్ కీపింగ్ బృందాలను నియమించారు. ఇందుకోసం ఏటా రూ.6 కోట్ల వరకు వెచ్చించనున్నారు. ఇలా అన్ని రకాల హంగులతో అభివృద్ధి చెందుతున్న ట్యాంక్‌బండ్ తీరాన్ని సందర్శించడానికి పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు.
చార్మినార్ తరహాలో నైట్‌బజార్..: త్వరలో నైట్‌బజార్ అందుబాటులోకి తెచ్చే కసరత్తు ముమ్మరమైంది. చార్మినార్ చుడీ బజార్ తరహాలో ఇది ఉంటుందని అధికారులు తెలిపారు. సాగర్‌లో ఇప్పటికే రూ.7 కోట్లతో తీర్చిదిద్దిన తేలియాడే మ్యూజికల్ ఫౌంటెయిన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. పర్యాటకులకు అనువుగా ఉండేందుకు త్వరలో దీన్ని పీపుల్స్ ప్లాజా వైపు మార్చనున్నారు. లుంబినీ పార్కు, సచివాలయం మధ్య సుందరమైన ఐలాండ్‌ను తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. మరికొద్ది రోజుల్లో ప్రారంభించే తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం చూపరులను మంత్రముగ్దుల్ని చేసే అవకాశం ఉంది. నగర వాసులు ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాంక్‌బండ్ తీరాన కొత్త సొబగులు ఇవీ చదవండి: