తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశ్నపత్రాలు ఎక్కడ ప్రింట్​ అవుతున్నాయని విద్యార్థులు అడుగుతున్నారు: గవర్నర్‌ - పరిశోధనలకు చిరునామాగా హైదరాబాద్

హైదరాబాద్ జేఎన్​టీయూ స్నాతకోత్సవానికి కులపతి హోదాలో తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన తమిళిసై.. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని, తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాల్లో విషాదం నింపొద్దని సూచించారు. నేటి విద్యార్థులు మొబైల్ ఫోన్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారన్నారు. ముందుగా దాని నుంచి బయట పడాల్సి ఉందన్నారు.

Governor Tamilisai Soundararajan
Governor Tamilisai Soundararajan

By

Published : Mar 19, 2023, 12:19 PM IST

Updated : Mar 19, 2023, 12:38 PM IST

''త్వరలో పరీక్షలున్నాయ్.. శ్రద్ధగా చదివి రాయండి అంటే.. ప్రశ్నపత్రాలు ఎక్కడ ప్రింట్‌ అవుతున్నాయని విద్యార్థులు అడుగుతున్నారు. ఇది జోక్‌ కాదు.. వాస్తవం'' అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. శనివారం జరిగిన హైదరాబాద్‌ జేఎన్‌టీయూ స్నాతకోత్సవానికి కులపతి హోదాలో తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షత వహించారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని, ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాల్లో విషాదం నింపొద్దని సూచించారు. సమాజంలో ఇప్పటికీ లింగ వివక్ష ఉందని వెల్లడించారు.

కొద్ది రోజుల క్రితం ఓ కార్యక్రమానికి వెళ్తే.. అక్కడ ఓ విద్యార్థి గవర్నర్‌గా మహిళలుంటారా? అని ప్రశ్నించాడని గుర్తు చేసిన తమిళిసై.. నేటి విద్యార్థులు మొబైల్‌ ఫోన్లపై విపరీతంగా ఆధారపడుతున్నారన్నారు. దాని నుంచి బయటపడాలని సూచించారు. పరీక్ష బాగా రాశావా? అని మరో విద్యార్థిని ప్రశ్నిస్తే 3 గంటల పాటు సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నానంటూ సమాధానమిచ్చాడని.. పరీక్షలకు హాజరైనందుకు విద్యార్థులకు కృతజ్ఞతలు చెప్పే పరిస్థితి వచ్చిందని గవర్నర్ వ్యాఖ్యానించారు.

శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు చిరునామాగా హైదరాబాద్‌:శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు చిరునామాగా హైదరాబాద్‌ మారుతోందని రాజస్థాన్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతి డా.కృష్ణస్వామి కస్తూరిరంగన్‌ అన్నారు. జేఎన్‌టీయూ గౌరవ డాక్టరేట్‌ను స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మైక్రో సెకన్లలో మార్పులు వస్తున్నాయని, వీటికి అనుగుణంగా విద్యార్థులు పరిశోధనలపై దృష్టి పెట్టాలని వారు తెలిపారు.

ఈ స్నాతకోత్సవంలో 92 వేల 5 మందికి డిగ్రీలు ప్రదానం చేశామని, వీరిలో 149 మంది పీహెచ్‌డీలు, 46 మంది బంగారు పతకాలు పొందిన వారు ఉన్నారని జేఎన్​టీయూ వర్సిటీ వీసీ కట్టా నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌, రెక్టార్‌ ఎ.గోవర్ధన్‌, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

జేఎన్‌టీయూ స్నాతకోత్సవంలో కులపతి తమిళిసై సౌందరరాజన్

గ్రూప్​-1 రద్దవ్వడం జీర్ణించుకోలేకపోతున్నాం: ఉమ్మడి రాష్ట్రంలో గతంలో చివరిసారి 2011లో గ్రూప్‌-1 ప్రకటన వెలువడింది. రాష్ట్రం ఏర్పాటు నుంచి 2022 వరకు మళ్లీ ఎటువంటి నోటిఫికేషన్‌ రాలేదు. ఈ నేపథ్యంలో 11 ఏళ్ల తరువాత 2022 ఏప్రిల్‌ 26న రికార్డు స్థాయిలో 503 పోస్టులతో తెలంగాణలో తొలి గ్రూప్‌-1 ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 80 వేల 202 మంది దరఖాస్తు చేశారు.

అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించగా.. 2 లక్షల 85 వేల 916 మంది ఈ పరీక్షను రాశారు. మెయిన్స్‌కు ప్రిలిమ్స్ అర్హత పొందిన వారికి షెడ్యూలు ప్రకారం జూన్‌లో ప్రధాన పరీక్షలు జరగాల్సి ఉంది. ఇంతలోనే ప్రత్నపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రాథమిక పరీక్ష రద్దయింది. గ్రూప్‌-1 కోసం కొన్ని సంవత్సరాలుగా చదివామని.. రద్దు అవ్వడం జీర్ణించుకోలేకపోతున్నామని.. ప్రిలిమినరీ పరీక్ష అర్హులై ప్రధాన పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 19, 2023, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details