ఇతర రాష్ట్రాలతో పోలిస్తే... తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోందని గవర్నర్(GOVERNOR) తమిళిసై సౌందరరాజన్(TAMILISAI SOUNDERA RAJAN) అన్నారు. కొవిడ్ టీకాలు వేగంగా అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ అభినందించారు. తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవి స్వీకరించి రెండేళ్లు పూర్తి చేసుకుని.. మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో రాజ్‌భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో "వన్ ఏమాంగ్ అండ్ ఏమాంగ్‌స్ట్ ద పీపుల్(ONE AMONG AND AMONGST THE PEOPLE)" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇటీవల మరణించిన ఆమె తల్లికి ఆ పుస్తకాన్ని అంకితమిచ్చారు.
గవర్నర్ పదవి కేవలం అలంకార ప్రాయం కాదని.... ప్రజలకు సేవ చేసేందుకు మంచి అవకాశమని ఈ రెండేళ్లలో తమిళిసై అనేకమార్లు చాటి చెప్పారు. రాజకీయ పార్టీల్లో పనిచేయటం, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండటం చాలా భిన్నమైనవని... గవర్నర్గా తాను చేపట్టిన కార్యక్రమాలకు మద్ధతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు.. గవర్నర్ సేవలను కొనియాడారు.
వసతులు పెంచాలి
అతి త్వరలో దేశంలోని ప్రతి ఒక్కరికీ కరోనా టీకా(CORONA VACCINATION) అందుతుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. టీకా ఉత్పత్తికి సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నాని చెప్పారు. కొవిడ్ సమయంలో తమవంతుగా రోగులకు కిట్స్ అందించిన దాతలను గవర్నర్ అభినందించారు. తలసేమియా రోగులకు సహాయం చేస్తున్న రెడ్ క్రాస్, ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుపేదలు ప్రభుత్వ ఆస్పత్రుల వైపు చూస్తున్నారని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మరింత పెంచాలని గవర్నర్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
గవర్నర్గా రెండేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాను. గిరిజనుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు మూడు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు చేపట్టడం.. నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. రాజ్ భవన్ అన్నం, టెలీ మెడిసిన్, రాజ్ భవన్ మహిళలకు బతుకమ్మ సందర్భంగా చీరల పంపిణీ సహా.. గత రెండేళ్లలో గవర్నర్గా చేపట్టిన అనేక కార్యక్రమాలు వ్యక్తిగతంగా సంతోషాన్ని ఇచ్చాయి. తెలంగాణలో ఉన్నత విద్య విలువలు పెంచేందుకు వైస్ ఛాన్స్లర్లతో తరచూ చర్చిస్తున్నాం.
-తమిళిసై సౌందరరాజన్, గవర్నర్