Revanth Reddy Tweet On Kaleshwaram: కేంద్ర జల్ శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ జీ .. కాళేశ్వరం అవినీతిపై ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున చెప్పి చూశామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తే పెడచెవిన పెట్టారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు మీరే అవినీతి జరిగిందంటున్నారని పేర్కొన్నారు. మాటలు సరే ముందు చర్యల సంగతి ఏంటో చెప్పాలని షెకావత్‌ను రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
అసలేెం జరిగిదంటే: గత కొద్ది రోజులుగాగోదావరికి వచ్చిన భారీ వరదతో మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 2 కీలక పంపుహౌస్‌ల పునరుద్ధరణ యత్నాలు కొనసాగుతున్నాయి. అన్నారం పంపుహౌస్‌ను పూర్వస్థితికి తీసుకొచ్చే పనులు 10 రోజులుగా జోరుగా జరుగుతున్నాయి. పంప్‌హౌస్‌లోకి వచ్చిన వరద నీటిని భారీ సామర్థ్యం కలిగిన మోటార్లతో బయటకు తోడేశారు. పంపులు, మోటార్లు శుభ్రం చేసే పని సాగుతోందన్న అధికారులు.. ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. ఆ తర్వాత పంపులను విడదీసి.. వాటిని పరిశీలించి ఆరబెట్టాక ఎంతమేర నష్టం జరిగిందనేది స్పష్టత వస్తుందని అంటున్నారు.
కీలకమైన కంట్రోల్ ప్యానెల్ గదిలో పరికరాలు శుభ్రం చేసే ప్రక్రియ సాగుతోంది. అది పూర్తయ్యాక ఏ మేరకు నష్టం జరిగిందనేది ఒక అంచనా వస్తుందని అధికారులు వివరించారు. కంట్రోల్ ప్యానెల్ రూంలోకి వరద నీరు చేరినందున కొన్ని పరికరాలు దెబ్బతిని పనికిరాకపోవచ్చని.. ప్రాథమిక అంచనాకు వచ్చారు. వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు ఇప్పటికే విదేశీ సంస్థలకు ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. పంపులు, మోటార్లకు సంబంధించి పెద్దగా నష్టం జరగలేదని భావిస్తున్న ఇంజినీర్లు.. పంపులు, మోటార్లకు ఏ మేరకు నష్టం వాటిల్లిందనేది వారం, పది రోజుల్లో స్పష్టత వస్తుందని చెబుతున్నారు. అనంతరం అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.