మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తాను చేయని వ్యాఖ్యల్ని తనకు అపాదిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు. ఇటీవల నారాయగూడలోని చర్చిలో యునైటెడ్ క్రిస్టియన్, పాస్టర్స్ సమావేశంలో పాల్గొన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలు చర్చి కమిటీల ప్రతినిధులు, పాస్టర్‌లు తమపై దాడులు జరుగుతున్నట్లు తెలిపారని పేర్కొన్నారు.
ఆ సమావేశంలో ఎవరేం మాట్లాడారో వాస్తవాలు తెలుసుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలు, మతాలకు రాష్ట్ర ప్రభుత్వం సమాన గౌరవం కల్పిస్తుందని వివరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక తర్వాత ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో.. పండుగలన్నీ ఘనంగా జరుగుతున్న విషయం ప్రజలకు తెలుసన్నారు. కేవలం మతాల పేరుతో అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు.