Tabreed Company to Invest in Telangana : ప్రపంచ ప్రఖ్యాత శీతలీకరణ కార్యకలాపాల సంస్థ తబ్రీడ్(Tabreed).. రాష్ట్రంలో తన భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో భాగంగా చేపట్టే కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం దాదాపు రూ.1600 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ ఫార్మాసిటీతో పాటు రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక పార్కుల అవసరాలకు కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తబ్రీడ్ సంస్థ అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు తబ్రీడ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని(MoU) కుదుర్చుకుంది. దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్(KTR Dubai Tour) సమక్షంలో సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. దుబాయ్‌లో మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ సీఈఓ ఖలీద్ అల్ మర్జు, ప్రతినిధి బృందం సమావేశమయ్యారు.
Minister KTR Dubai Tour : రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ హితం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో భారీగా కొనసాగుతున్న పారిశ్రామికీకరణ, వేగంగా విస్తరిస్తున్న వ్యాపార వాణిజ్య ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని సస్టైనబుల్ భవిష్యత్తు కోసం ఈ అవగాహనా ఒప్పందం ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ పరిస్థితులకు అనుకూలంగా డిస్టిక్ కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తక్కువ విద్యుత్ శక్తిని ఉపయోగించుకునే కూలింగ్ పరిష్కారాలు, కూల్ రూఫ్ పాలసీ వంటి విధానాల ద్వారా రాష్ట్రం 2047 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని అందుకునే దిశగా ముందుకు పోతుందని మంత్రి తెలిపారు.
Tabreed company to Invest Rs 1600 Crore in Hyderabad : తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం భారత దేశ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సంస్థ చైర్మన్ ఖాలిద్ అబ్దుల్లా అల్ ఖుబాసి తెలిపారు. డిస్ట్రిక్ట్ కూలింగ్ రంగంలో ఉన్న అపారమైన అనుభవం, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగిస్తామని చెప్పారు. హైదరాబాద్ ఫార్మాసిటీతో పాటు పారిశ్రామిక పార్కుల అవసరాల మేరకు కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయనున్నట్లు తబ్రీద్ సంస్థ పేర్కొంది.