తెలంగాణ

telangana

ETV Bharat / state

T Savari App: అన్నీ సేవలు ఒకే యాప్​లో అన్నారు.. ఆచరణలో మాత్రం శూన్యం చేశారు!

T Savari App for Hyderabad: మెట్రో రైలు టికెట్‌ కొనేందుకు ఒక యాప్‌.. సైకిల్‌, బైకు అద్దెకు తీసుకుంటే మరో యాప్‌. వాహనాలు పార్కింగ్‌ చేయాలంటే మరో యాప్‌.. ఈ తరహా సేవలన్నీ అనుసంధానించి ఒక యాప్‌లో అందిస్తామని.. ఒక్క స్మార్ట్‌ కార్డుతో 16 సేవలు అంటూ హైదరాబాద్‌ మెట్రోరైలు(హెచ్‌ఎంఆర్‌) గతంలో ఘనంగా ప్రకటించినా (T Savari App services) ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. ఒక్కోదానికి ఒక్కో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంది. యాప్‌ లేదనే పేరుతో కొన్ని సేవలకు అదనంగా బాదుతున్నారు.

T Savari App, T Savari App services
టీ సవారీ యాప్‌

By

Published : Nov 30, 2021, 9:24 AM IST

T Savari App for Hyderabad: మెట్రోరైలు ప్రయాణికుల కోసం టీ సవారీ యాప్‌ (T Savari App services) తీసుకొచ్చారు. మెట్రో వేళలు, ప్రయాణ ఛార్జీల సమాచారంతో పాటూ మెట్రో టిక్కెట్‌, ఆన్‌లైన్‌ రీఛార్జ్‌ సేవలు అందిస్తోంది. దీనికి అనుసంధానంగా ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌, ఆటో, క్యాబ్‌, బైక్‌ ట్యాక్సీలు, పార్కింగ్‌, షాపింగ్‌.. ఇలా ప్రయాణికుడికి అవసరయ్యే ప్రతిచోట చెల్లుబాటు అయ్యేలా ఉంటుందని హైదరాబాద్‌ మెట్రోరైలు అధికారులు చెప్పారు. ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌ ప్రజారవాణా ప్రభుత్వ సంస్థలు కావడం, ఆదాయం పంపకాల వంటి విషయాలు ఎలా ఉండాలనేదానిపై స్పష్టత లేకపోవడంతో అనుసంధాన ప్రక్రియ ముందడుగు పడటం లేదు.

కానీ ప్రైవేటు రంగంలో ఉన్న ఆటోలు, క్యాబ్‌లు, సైకిల్స్‌, బైకుల అద్దెలు, పార్కింగ్‌ ఫీజులకు సంబంధించి ఆదాయ పంపకాలు ఏమి ఉండదు. ఎవరి లెక్క వారికి స్పష్టంగా ఉంటుంది. కానీ ఇప్పటివరకు వీటిని సైతం అనుసంధానం చేయలేకపోతున్నారు. టీ సవారీ యాప్‌ (T Savari App services)లోనే మెట్రోకి అనుసంధానంగా లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ అందించే అద్దె సైకిళ్లైన స్మార్ట్‌బైక్‌ యాప్‌, పార్కింగ్‌ నిర్వహిస్తున్న పార్క్‌ హైదరాబాద్‌ యాప్‌, ఇంకా ఇతర సేవలను ఇంటిగ్రేట్‌ చేయవచ్చు అని ఐటీ నిపుణులు చెబుతున్నారు. కానీ అలా చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వీరేశ్‌ శనివారం ఎల్‌బీనగర్‌ స్టేషన్‌ వద్ద బండిని పార్క్‌ చేసేందుకు వెళితే పాతిక రూపాయలు కట్టాల్సిందే అని అక్కడి ఆపరేటర్‌ అన్నారు. కనీస ఛార్జీ రూ.15 అని మెట్రో అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆపరేటర్లు విన్పించుకోవడం లేదు. యాప్‌ ద్వారా పార్కింగ్‌ సేవలు వినియోగించుకుంటే రూ.15 అని పార్కింగ్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా మెట్రో అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పార్కింగ్‌పై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదని వాపోతున్నారు.

పురోగతి లేదు...

మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌, ఆటో, క్యాబ్‌లు, ఇతరత్రా రవాణా ఆధారిత సేవలన్నింటిని కలిపి కామన్‌ మొబిలిటీ కార్డును తీసుకొస్తున్నట్లు రెండేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి పురోగతి లేదు. జాతీయ స్థాయిలో 2005లో ఈ ప్రతిపాదనలు తెరపైకి వచ్చినా.. ప్రజారవాణా సంస్థల నుంచి చొరవ లేకపోవడంతో 16 ఏళ్లు అవుతున్నా అతీగతీ లేదు. ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌ వంటివి ఇందులోకి రావాలంటే పాయింట్‌ ఆఫ్‌ సర్వీఎస్‌(పీవోఎస్‌) యంత్రాల ఏర్పాటు వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. సమయం పట్టేలా ఉంది. అయితే ప్రైవేటులో సైకిళ్లు, బైకు, క్యాబ్‌లు అద్దెకిస్తున్న సంస్థలు, పార్కింగ్‌ చూస్తున్న సంస్థలు యాప్‌ ద్వారానే సేవలు అందిస్తున్నాయి. వీటివరకైనా తొలుత అనుసంధానించే అవకాశం ఉన్నా.. హెచ్‌ఎంఆర్‌గానీ... మెట్రోని నిర్వహిస్తున్న ఎల్‌ అండ్‌ టీ మెట్రోగానీ పట్టించుకోవడం లేదు.

ఇదీ చూడండి:Metro winners: మెట్రోలో ప్రయాణించారు.. బహుమతులు అందుకున్నారు..

ABOUT THE AUTHOR

...view details