తెలంగాణ

telangana

ETV Bharat / state

కళాకారులకు పట్టం... టీ-కల్చర్​తో సాధ్యం - telangana Artists

సంస్కృతి సంప్రదాయల సమ్మేళనం మన రాష్ట్రం. క‌ళ‌ల ఖ‌జానాగా మన తెలంగాణ‌కు పేరు. అంతటి పేరు పఖ్యాతలు తెచ్చిపెట్టిన క‌ళాకారులకు ప్రభుత్వం తరఫున గుర్తింపు అందజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 'టీ-కల్చర్' యాప్ ను అందుబాటులోకి తీసుకు రానుంది. కళాకారులకు ఐడీ కార్డులతో పాటు.. ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు అవకాశం కల్పించే విధంగా సరికొత్తగా రూపొందిచిన టీ-కల్చర్‌ యాప్‌కు ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు దక్కింది.

T-Culture app For telangana Artists
T-Culture app For telangana Artists

By

Published : Aug 30, 2020, 11:53 AM IST

ఒగ్గు, జానపద, చిందు యక్ష తదితర ఎన్నో కళలకు నిలయమైన తెలంగాణలో కళాకారులకు గుర్తింపు నిచ్చేందుకు భాషా సంస్కృతికశాఖ , తెలంగాణ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) భాగ‌స్వామ్యంతో టీ-కల్చర్ యాప్ తీసుకువచ్చింది. దీంతో కళాకారులు మొబైల్‌ నుంచే గుర్తింపు కార్డు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం క‌లగనుంది.

30 రోజుల్లోనే కార్డు...

గ్రామీణ‌ ప్రాంత క‌ళాకారులు సైతం ఈ యాప్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకొని కేవలం 30 రోజులలో కార్డు పొందవచ్చు. దేశంలో‌నే మొద‌టి సారిగా తెలంగాణ క‌ళాకారుల‌కు ఈ అవ‌కాశం రాబోతున్నట్లు... ఈ ఘనతకు గాను.. ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు సైతం రాష్ట్రానికి దక్కిందని భాషా సాంస్కృతిక శాఖ సంచాల‌కులు మామిడి హ‌రికృష్ణ తెలిపారు.

ప్రయోజనాలు పొందటం సులభతరం...

క‌ళాకారుల ఐడీ కార్డుల కోసం డేటాబేస్ త‌యారీ కోసం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ‌ ఇప్పటికే ప‌లు కార్యక్రమాలు నిర్వహించింది. ఈ డేటాబేస్ ద్వారా కళాకారుల వ‌య‌సు, స్వస్థలం, కళారూపం, నైపుణ్యాలు తదితర సమాచారం అంతా ఒక్కచోటే క్రోడీకరించే వీలు కలుగుతుంది. త‌ద్వారా క‌ళాకారుల‌కు ల‌భించే స్కీములు, వారికి చేకూరే ప్రయోజ‌నాలను లబ్దిదారులు పొందడం మరింత సుల‌భతరం కానుంది. గుర్తింపు కార్డులతో పాటు.. కళలు, కళారూపాలు, కార్యక్రమాల నిర్వహణ, ఈ-బుక్స్ వంటి అనేక ఫీచర్లు ఈ యాప్ లో పొందుపరిచారు.

కళాకారుల ఆనందం...

ఈనెల 27 నుంచి అందుబాటులోకి రానున్న టీకల్చర్ యాప్ ద్వారా తెలంగాణ క‌ళాకారులుగా ఐడీ కార్డు పొందనుండటంతో కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. వెలుగులోకి రాని అనేక కళలు, కళలను నమ్ముకొని పొట్ట పోసుకునే తమకు.. ఒక గుర్తింపు లభిస్తుందని, కళాకారుడని గర్వంగా చెప్పుకునే అవకాశం లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. భాషా సాంస్కృతిక శాఖ కార్యక్రమాల గురించి, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరటం అదనపు ప్రయోజనమని.. కళాకారుడిగా గుర్తింపు పొందేందుకు తాము పడ్డ కష్టాలకు మోక్షం లభించిందని అంటున్నారు.

కళాకారులకు అన్ని విధాల ఉపయోగపడే ఆప్‌ రూపొందిచడం దానికి జాతీయస్థాయిలో గుర్తింపు రావడం ఎంతో ఆనంద కలిగిస్తుందని ఆప్‌నిర్వాహకులు తెలిపారు. కళలను రక్షించే తమకు రక్షణ రాబోతుందని కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి :ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ABOUT THE AUTHOR

...view details