రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు చేపట్టింది. నిర్మల్‌లో చేపట్టిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Tpcc Chief Revanth Reddy) పాల్గొన్నారు. టోల్ ప్లాజా నుంచి గాంధీపార్క్ వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం మోపుతున్నాయని ఆరోపించారు. సామాన్యుడి నడ్డీ విరిచే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఇందిరాపార్క్ వద్ద...
హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నాచేశారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ సహా సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య... ఎడ్ల బండిపై వచ్చి నిరసన తెలిపారు. ర్యాలీ నిర్వహణకు అనుమతి లేనందున పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్ట్ చేయటాన్ని నేతలు తప్పుబట్టారు. ఉప్పల్‌లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనటంతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. రంగారెడ్డి జిల్లా కందుకూరులో శ్రీశైలం జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఇందులో పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో ప్రజలను దోచకుంటున్నారని ఆరోపించారు.
సామాన్యుడికి చుక్కలు...